తుమ్మల రాజీనామా తెదేపాకు మేల్కొలుపు?

 

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి సేవలు అందించిన తుమ్మల నాగేశ్వరరావు నిన్నపార్టీకి రాజీనామా చేయడంతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తన పార్టీ తెలంగాణా నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యి ఈ అంశంపై చర్చించారు. అటువంటి సమర్దుడయిన సీనియర్ నేతను పోగొట్టుకోవడం తెదేపాకు చాలా నష్టం కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆయన పార్టీ వీడకుండా చివరి నిమిషం వరకు ప్రయత్నించి విఫలమయిన తెదేపా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడం సహజమే. ‘తెదేపా నాయకుల మీద కాక కార్యకర్తల అండతోనే బలంగా ఉందని, ఒకరు పోతే వందమంది నేతలను తయారు చేసుకొంటామని’ అని చెప్పుకొంది. అయితే ఇదివరకు కడియం శ్రీహరి, దాడి వీరభద్ర రావు వంటి సీనియర్ నేతలు పార్టీని వీడినప్పుడు కూడా తెదేపా ఇదేవిధంగా స్పందించింది తప్ప వారి స్థానాలలో మళ్ళీ అంతటి సమర్దులయిన నాయకులను ఏర్పాటు చేసుకోవడంలో అశ్రద్ధ వహించిన సంగతి అందరికీ తెలిసిందే. బహుశః ఇప్పుడు కూడా అదే ఉదాసీనత కనబరచవచ్చును.

 

పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నపుడు, ఆంధ్రాలో రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కూడా రెండు ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలను చంద్రబాబు నాయుడు ఎంతో జాగ్రత్తగా కాపాడుకొచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ చక్కబడిన తరువాత పార్టీ నుండి నేతలు ఒకరొకరుగా జారిపోకుండా జాగ్రత్తపడలేక పోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నా, ఆయన పని ఒత్తిడి కారణంగా ఇదివరకులా పార్టీ తెలంగాణా శాఖపై దృష్టి పెట్టలేకపోవడం వలననే ఈవిధంగా జరుగుతోందని భావించవచ్చును.

 

అసలు తెలంగాణాలో అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు అధికార తెరాస పంచన ఎందుకు చేరుతున్నారు? అనే ప్రశ్నకు జవాబు అందులోనే కనబడుతుంది. రాజకీయ నేతలందరూ తాము కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాలలోకి ఉన్నామని ఎన్ని కధలు చెప్పినా వారి లక్ష్యం అధికారం, పదవులు చెప్పట్టడమేననేది ఎవరికీ తెలియని విషయం కాదు. అందుకు తుమ్మల కూడా మినహాయింపు కాదు. అందుకే ఆయన కేసీఆర్ మంత్రివర్గంలో బెర్త్ ఖాయం చేసుకొని గోడ దూకేసారని వార్తలు వినిపిస్తున్నాయి. తుమ్మలను పార్టీలోకి ఆకర్షించి ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉన్న తెరాసను బలోపేతం చేసుకోవాలని తెరాస అధ్యక్షుడి ఆలోచన కావచ్చును. వచ్చే ఎన్నికల సమయానికి తెలంగాణాలో తెదేపాను ఖాళీ చేసేస్తామని తెరాస నేతలు చెప్పిన మాట తెదేపా అధిష్టానం సీరియస్ గా తీసుకొన్నట్లు లేదు. కానీ తెరాస మాత్రం సీరియస్ గానే చెప్పిందని తుమ్మల రాజీనామా రుజువు చేసింది.

 

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో తలమునకలవక ముందే తెలంగాణాకు ప్రత్యేకంగా పార్టీ అధ్యక్షుడిని, పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వారిలో ఐఖ్యత, సమన్వయం లోపించడంతో పార్టీలో నేతలందరూ ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణా ఏర్పడిన తరువాత ఒక్క మహానాడు సమావేశంలో తప్ప ఆ తరువాత పార్టీ నేతలందరూ ఒక్క వేదికపైకి వచ్చి గట్టిగా మాట్లాడిన సందర్భాలు లేవనే చెప్పవచ్చును. తెదేపా-తెలంగాణా నేతలందరూ మంచి రాజకీయ అనుభవజ్ఞులే కానీ వారిలో ఐఖ్యత లోపించడంతో పార్టీ సమావేశాలు, కార్యక్రమాలు కూడా తగ్గిపోయాయి. దీనితో పార్టీలో చాల స్తబ్ధత, నిరుత్సాహ వాతావరణం నెలకొని ఉంది.

 

ఇటువంటి సమయంలో వారందరికీ పార్టీ అధినేత అండదండలు, ప్రోత్సాహం, మార్గదర్శనం, వారి భవిష్యత్ కు భరోసా చాలా అవసరం ఉంది. కానీ అదే వారికి దొరకడంలేదని చెప్పవచ్చును. తెదేపా పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను, కార్యకర్తలను చైతన్యంగా ముందుకు నడిపిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం సడలకుండా ఏవిధంగా ముందుకు నడిపించారో ఇప్పుడు కూడా అదేవిధంగా చేయగలిగితే బహుశః ఇటువంటి పరిస్థితి తలెత్తదు. కానీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక క్లిష్టమయిన బాధ్యతలు తలకెత్తుకొన్న చంద్రబాబు నాయుడు, తన తెలంగాణ శాఖపై ఇది వరకులా దృష్టి పెట్టగలరా? లేదా? లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమి చేస్తారు? అవి ఎంతవరకు ఫలిస్తాయి? అనే దానిపైనే పార్టీ మరియు నేతల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.