వైసీపీ దుష్ప్రచారంపై టీటీడీ ఆగ్రహం

గోవుల మ‌ృతి ప్రచారంపై భూమనకు భానుప్రకాష్ సవాల్

తిరుమల తిరుపతి దేవస్థానంలో తీవ్ర అవకతవకలు పాల్పడి విచారణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు మరో దుష్ప్రచారానికి తెర లేపారు. టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందుతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. గత మూడు నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. చనిపోయిన ఆవులకు సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసింది. టీటీడీ, ప్రభుత్వం ఈ విషయాన్ని బయటకు రాకుండా రహస్యంగా ఉంచినట్లు ఆరోపించారు. టీడడీ గోశాలలో ఆవుల మరణంపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా విచారణ జరిపించాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఎపిసోడ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

అయితే ఆ ప్రచారం అంతా అవాస్తమని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. మృతి చెందిన గోవుల ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావని, కొంతమంది దురుద్దేశంతో ఆ ఫొటోల్లో ఉన్నవి  టీడీపీ గోవులుగా చూపిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని టీటీడీ యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నామని టీటీడీ తెలిపింది. 

ఎస్వీ గోశాలలో గోవులు దారుణంగా చనిపోతున్నాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు ఆరోపణలు చేయడం కాదని.. గోశాల పరిశీలనకు రావాలని కరుణాకర్ రెడ్డికి భానుప్రకాష్ సవాల్ విసిరారు. శ్రీవారిని కించపరిచే విధంగా వ్యవహారాలు నడిపిన చరిత్ర కరణాకర్ రెడ్డిది అంటూ మండిపడ్డారు. ఆయన వస్తే అన్ని రికార్డులను చూపిస్తామన్నారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం కరుణాకర్ రెడ్డికి తగదని,  లీగల్‌గా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. శ్రీవారి ప్రసాదాలకు వాడిన పదార్థాలు కూడా నాణ్యమైనవి కాదని ఇప్పటికే నివేదికలు ఉన్నాయన్నారు. టీటీడీ గోశాల  కరుణాకర్ రెడ్డి పరిశీలన చేయవచ్చని సవాల్ చేశారు. అనారోగ్యంతో చనిపోయిన గోవుల వివరాలను టీటీడీ రికార్డులను నిర్వహిస్తోందన్నారు. కరుణాకర్ రెడ్డి హయాంలో టీటీడీలో పెద్దఎత్తున నిధులను దారి మళ్లించిన ఘనత ఆయనదే అంటూ భాను ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతున్నాయడానికి నిదర్శనం వైసీపీ అని, ధార్మిక క్షేత్రంలో దారుణం జరిగిపోతోందని అసత్య ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు. మరి భానుప్రకాష్ సవాల్‌ను భూమన  ఏ మాత్రం స్వీకరిస్తారో? తమ అరోపణల్లో నిజముంటే వాటిని ఏ మాత్రం నిరూపిస్తారో చూడాలి?