గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్.. నెల్లూరు జైలుకు తరలింపు

వైసీపీ సీనియర్ నాయకుడు,   హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడికి ప్రయత్నించిన గోరంట్లతో పాటు ఆయన అనుచరులు ఐదుగురికి  గుంటూరు కోర్టు  రిమాండ్ విధించింది. దీంతో మరో వైసీపీ నేత కటకటాల పాలైనట్లైంది.

వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్ అనే తెలుగుదేశం కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు తరలిస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాన్ని నిలువరించి, వారి సమక్షంలోనే చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ పోలీసులు గోరంట్ల మాధవ్ ను అదుపులోనికి తీసుకుని శుక్రవారం సాయంత్రం గుంటూరు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.  దీంతో ఆయనను పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. నెల్లూరు జైలుకే ఎందుకంటే.. గోరంట్ల మాధవ్ దాడి చేయడానికి ప్రయత్నించిన చేబ్రోలు కిరణ్ ఇప్పటికే గుంటూరు జైలులో ఉండటంతో.. గోరంట్ల మాధవ్ ను నెల్లూరు జైలుకు తరలించారు.