అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్
posted on Apr 16, 2025 11:09AM

అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ఇన్నాళ్లూ కఠిన నిబంధనలు అమలు చేస్తూ వచ్చిన అమెరికా ప్రభుత్వం, తాజాగా వారికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి వలసల విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్రమంగా ఉంటూ స్వీయబహిష్కరణ చేసుకోవాలనుకునే వారికి ట్రంప్ ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించారు. అలాంటివారికి విమాన ఖర్చులతో పాటు కొంత నగదు అందిస్తామని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్నవారిపై ఇమిగ్రేషన్ అధికారులు దృష్టిసారించారన్నారు. అయితే, చట్టవిరుద్ధంగా ఉంటున్న సాధారణ పౌరుల కోసం స్వీయబహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలా వెళ్లాలనుకునేవారికి తాము విమాన ఖర్చులతో పాటు కొంత నగదును అందిస్తామని ప్రకటించారు. వెళ్లిపోయినవారిలో మంచివారు ఉంటే వారిని వెనక్కి తీసుకోవడం పైనా ట్రంప్ మాట్లాడారు. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టడమే తమ ప్రథమ లక్ష్యమని ఆయన ఈసందర్భంగా స్పష్టంచేశారు. అయితే.. సముచితమని భావిస్తే వారు చట్టపద్ధతిలో వెనక్కి తిరిగిరావడానికి అనుమతిస్తామన్నారు.
స్వీయ బహిష్కరణకు తుది ఉత్తర్వులు పొంది కూడా 30 రోజులు దాటి అమెరికాలో నివసిస్తున్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెన్ట్స్‌కు రోజుకు 998 డాలర్లు జరిమానాగా విధిస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్వీయ బహిష్కరణ వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు. స్వతహాగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లడం వెళ్లాలనేకునే వారికి సాయం అందిస్తామని చెప్పారు. తమ దేశాలకు వెళ్లే క్రమంలో చార్జీలను భరించలేకపోతే.. సబ్సిడీ విమాన సర్వీసుకు కూడా అర్హులవుతారని అధికారులు పేర్కొన్నారు.