తెలంగాణ ఉద్యమం బలహీన పడుతోందా?
posted on Apr 5, 2012 6:52AM
తెలంగాణ ఉద్యమం మళ్ళీ పుంజుకుంటుందా? లేదా? అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకోనసాగుతోంది. సకలజనుల సమ్మె అనంతర పరిణామాలు, టి ఆర్ ఎస్ నేత చంద్రశేఖర్ పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణా ప్రాంతంలో క్రమంగా ఏర్పాటు ఉద్యమం బలహీనపడింది. ఇక ఉద్యమం సమసిపోతుందనే తరుణంలో ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణా నేతలు ఉప ఎన్నికలను ఆసరా చేసుకుని మరలా ఉద్యమాన్ని ముందుకు తీసుకు రావాలని భావించారు. అయితే ఉప ఎన్నికల ఫలితాలలో తెలంగాణా రాష్ట్ర సమితి కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజక పరిధిలోని మహాబూబ్ నగర ఓడిపోవడం టి ఆర్ ఎస్ కు ఇబ్బందికరంగా మారింది.
పైగా ఇక్కడ బిజెపి అభ్యర్థి విజయం సాధించడం వల్ల కులం, మతం వంటి అంశాలన్నీ ముందుకు రావడంతోపాటు ఏకంగా ముస్లిం సామాజికవర్గం తమను తెలంగాణ ఉద్యమలో భాగస్వాములుగా చూడటం లేదనే మనస్తానికి గురైనట్లుగా వార్తలు వెలువడ్డాయి. అదే విధంగా ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి కూడా ప్రతిష్టను కోల్పోయింది. ఈ స్థితిలో అసలు ఉద్యమం బలహీనపడుతుందనే భయం కూడా తెరాస నేతలలో నెలకొంది. ఇటువంటి స్థితిలో వరంగల్ లో ఎంబీఏ విద్యార్థి బోజ్యానాయాక్, మరో ఆటోడ్రైవర్ తెలంగాణ రాదనే నిరుత్సాహంతో ఆత్మహత్యలకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి.
ఈ వార్తల నేపథ్యంలోనే తెలంగాణ బంద్ కు పిలిపునిచ్చారు. బంద్ ఊహించిన రీతిలో ప్రజలలో స్పందన కనిపించకపోవడం, కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా వాణిజ్య సంస్థలను మూయించాల్సి రావడం వంటి అంశాలు కూడా ఏర్పాటు ఉద్యమ నేతలను కలవరపరచింది. ఇదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ అంశంపై సభా కార్యక్రమాలను స్తంభింప చేసిన కేంద్రప్రభుత్వంలో ఉలుకుపలుకు లేకుండా వుంది. పైగా కేంద్ర హోంమంత్రి చిదంబరం రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒకేమాటపై వుంటే మినహా తాము చేయగలిగింది ఏమీ లేదని ప్రకటించడం, పైగా రాయలసీమవారికి ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించడాన్ని బట్టి ఉద్యమానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంపై చర్చజరుగుతోంది. ప్రత్యేక ఉద్యమం ఇక చరిత్ర మాత్రమేనని కొంతమంది వ్యాఖ్యానిస్తుంటే .... టి ఆర్ ఎస్ నేత చంద్రశేఖర్ సామాన్యుడు కాదని ఉద్యమాన్ని మళ్ళీ పుంజుకునేలా చేస్తాడనే మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.