కిరణ్ కు సవాలుగా మారిన కడప ఉప ఎన్నికలు
posted on Apr 5, 2012 6:54AM
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కడప ఉప ఎన్నికలు పెద్ద సవాలుగా మారాయి. ఈ జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీలకు త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో కనీసం ఒక దానిలో అయినా కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే అధిస్థానం దృష్టిలో తాను చులకనైపోతానని కిరణ్ కుమార్ రెడ్డి మదనపడు తున్నట్లు తెలిసింది. అయితే ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఇటీవల కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారు. అసమ్మతివాదులకు నామినేటేడ్ పదవుల ఆశలు చూపిస్తున్నారు. అయినా అసమ్మతి మాత్రం పెద్దగా తగ్గలేదు. రాయచోటి నియోజకవర్గ టిక్కెట్ ను మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, పిసిసి సభ్యుడు రామ్ ప్రసాద్ రెడ్డి ఆశిస్తున్నారు.
ముఖ్యమంత్రి వీరిద్దరి మధ్య రాజీకుదర్చడానికి ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఒకరికి టిక్కెట్ ఇస్తే మరొకరికి నామినేటేడ్ పదవి ఇస్తానని ఆశ చూపిస్తున్నారు. అయినా ఇద్దరి వైఖరిలో పెద్దగా మార్పు రాలేదు. రాజంపేట టిక్కెట్ ను మల్లిఖార్జునరెడ్డికి కట్టబెట్టాలని కిరణ్ కుమార్ రెడ్డి యోచిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న బలిజ సామాజికవర్గ నేతలంతా మల్లిఖార్జునరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మల్లిఖార్జునరెడ్డి కాక మరెవరికి టిక్కెట్ ఇచ్చినా తమకు అభ్యుంతరం లేదని వారు అంటున్నారు. వీరిని కాదని మల్లిఖార్జునరెడ్డికి టిక్కెట్ ఇస్తే ఇక్కడ డిపాజిట్ కూడా దక్కదని కార్యకర్తలు అంటున్నారు. రైల్వేకోడూరులో కాంగ్రెస్ టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే జివి ప్రసాద్, మాజీ ఎంపిపి ఈశ్వరయ్య పోటీపడుతున్నారు. ఈశ్వరయ్య అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీ బత్యాల బలపరుస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈశ్వరయ్య వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కడప జిల్లాలో జరిగే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క స్థానాన్నైనా గెలుచుకోకపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడం ఖాయం.