ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ నేతల దౌర్జన్యం.. కలెక్టర్ ని కూడా వదలకుండా బెదిరింపులు!

 

ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాప్రతినిధులు అధికారులను చూస్తే చాలు ఆవేశంతో ఊగిపోతున్నారు. తాము చెప్పినట్లు చెయ్యాలని హుకుం జారీ చేయడం నిత్యకృత్యం అయిపోతుంది. తమ సొంత పనుల విషయంలో అధికారులు మాట వినక పోతుండటంతో మండల స్థాయి నేతల నుంచి ఎమ్మెల్యే, మంత్రి వరకు అందరికీ అహం దెబ్బ తింటుంది. సాధారణంగానే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆదివాసీ గూడేలలో పనుల కోసం ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారు. అలాంటప్పుడు సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం.. పని జరిగేలా చూడటం.. సమస్య సరైందైతే స్థాయిని బట్టి అధికారులను సైతం ఆదేశించటం చేయాల్సిందే. 

ఈ మధ్య టీఆర్ఎస్ కు చెందిన జడ్పీ ఛైర్మన్.. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు తాము చెప్పినట్లు వినాల్సిందేనని లేదంటే తిరగబడతామని అధికారులతో జరిగిన సమావేశంలో నోరు జారారు. అతిపెద్ద రాద్ధాంతానికి కారణమైంది. ఆ క్రమంలో అధికారుల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తమైంది. ఏం జరిగినా ప్రజాప్రతినిధులు మాత్రం తమ వైఖరి మార్చుకోవడం లేదని అధికారులు హైరానా పడుతున్నారు. కలెక్టర్ పై జడ్పీ చైర్మన్ చేసిన కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా రచ్చకు దారి తీయగా అధిష్టానం ఆయన్ని మందలించినట్లు ప్రచారం జరిగింది. ఆయనే కాకుండా ఎంపీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు ఆఖరికి ఏ పదవులు లేని టీఆర్ఎస్ నాయకులు సైతం అధికారులపై జులుం చేస్తూనే ఉన్నారు. అయితే అది జనం సమస్యల కోసమైతే ఫర్వాలేదు కానీ సొంత పనుల కోసం వారు అలా ప్రవర్తిస్తుండటం వివాదాస్పదమవుతుంది. 

ఈ మధ్య కాలంలో ఓ ఎమ్మెల్యే తన మాట వినాలని తహసీల్దారుపై రుబాబు చేశారు. పలాన వ్యక్తికి సంబంధించిన భూమి పట్టా ఆపాలని.. మరో చోట ఓ వ్యక్తికి సంబంధించిన ఓ పని బిల్లులు నిలిపి వేయాలని కొందరు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు హుకుం జారీ చేశారు. అంతా కరెక్ట్ గా వుంటే ఆపడం ఎలా అని అధికారులు ప్రశ్నిస్తే మాకే ఎదురు తిరుగుతావా అని వార్నింగ్ లు సైతం ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే జిల్లా స్థాయి ప్రజాప్రతినిధిని కలిసి తమ వర్గానికి సంబంధించిన భూములకు పట్టాలివ్వాలని తహసీల్దార్ ఆర్డీవోలను అడిగారు. రూల్ ప్రకారం కుదరదంటే ఆ ప్రాంతంలో ఏ మీటింగ్ జరిగినా అక్కడున్న అధికారులపై ప్రజా ప్రతినిధులు పిచ్చి పిచ్చి ప్రశ్నలతో ధ్వజమెత్తుతున్నారు. ఏ చిన్న లోపం దొరికిన పెద్దగా చూపడమే కాకుండా అసలు తప్పే లేక పోయినా నోటికి పని చెబుతున్నారు. 

కొంతమంది మాజీ కౌన్సిలర్ లు సైతం తమ మాట వినాలి లేదంటే సారుకు చెపుతామని తరవాత అధికారం కూడా మేమే అప్పుడు చూస్తాం అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. లీగల్ సమస్య తీర్చమంటే ను, రూల్స్ కు అనుగుణంగా పనిచెయ్యమంటేను అర్థముంది. కానీ అడ్డమైన పనులు కోసం వేధిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య ఓ ఎమ్మెల్యే ప్రొటోకాల్ విషయానికి సంబంధించి మంత్రితో అధికారులకు చీవాట్లు పెట్టించారు. శిలాఫలకంలో పేరు చివర ఉందని మంత్రి అలా మందలించడం పై కొంత మంది అధికారులు నొచ్చుకొని తమ తప్పేమీ లేదని వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. 

ఇలా సర్పంచ్ నుంచి మంత్రి వరకు తమపై పెత్తనం చెలాయించటం పదిమంది ఉన్న చోట మనసు నొచ్చుకునేలా ప్రయత్నిస్తుండటంపై ఉన్నతాధికారుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు కింది స్థాయి ఉద్యోగులు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల అరాచకాలు భరించలేకపోతున్నామని చెబుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు సక్రమం గానే విధులు నిర్వహిస్తున్నా.. జిల్లా కలెక్టర్ చెప్పినట్లే నడుచుకుంటారా మేమంటే లెక్కలేదా అని టార్గెట్ చేస్తున్నారు కొందరు నేతలు. దాంతో కొంత మంది కలెక్టర్ మేడం చాలా స్ట్రిక్ట్ అని తప్పించవలసి వస్తోంది. ఏదేమైనా జనం సమస్యల కోసం కాకుండా సొంత పనుల కోసం పావులు కదుపుతూ చెప్పినట్లు వినకపోతే సమావేశాల్లో జనం ముందు అధికారులను బద్నాం చేసే ప్రయత్నాల్లో మునిగిపోతున్నారు కొందరు నేతలు. వారి ఆగడాలకు ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి మరి.