వైసీపీ కార్యకర్తలా మాట్లాడుతున్న ప్రొ. నాగేశ్వర్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, రాజకీయ నాయకులను హైదరాబాద్ నుంచి తరిమేసినప్పటికీ, తెలంగాణ నాయకులకు, మేధావులకు ఆంధ్ర రాజకీయాల మీద ఎక్కడలేని ఆసక్తి. ఆంధ్ర నాయకులు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడరు. కానీ, తెలంగాణ నాయకులు, మేధావులు మాత్రం ఆంధ్ర రాజకీయాల గురించి కామెంట్ చేస్తూ తమ ఆసక్తిని ప్రదర్శిస్తూ వుంటారు. అలాంటి వారిలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకరు. 

దేశంలో ఎక్కడైనా రైతుల భూమి హక్కు పత్రమైన పట్టాదార్ పాస్ పుస్తకం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటో వుంటుందా? ఐదేళ్ళపాటు పాలించే ముఖ్యమంత్రి ఫొటో శాశ్వతంగా వుండే పాస్ బుక్ మీద వుంటుందా? రైతుల సొంత భూమి పాస్ పుస్తకాల మీద ఆ భూమితో ఎలాంటి సంబంధం లేని ముఖ్యమంత్రి ఫొటో వుంటుందా? వుండదు.. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు మాత్రం ఆ ఖర్మ పట్టింది. తమకు వారసత్వంగా వచ్చిన లేదా తాము శ్రమించి సంపాదించుకున్న భూమి తాలూకు పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫొటో చూసి తరించాల్సి వస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్ర అసంతృప్తితో వున్నారు. రెండ్రోజుల క్రితం సీఎం సతీమణి భారతి పులివెందులలో ప్రచారానికి వెళ్తే అక్కడ వైసీపీ కార్యకర్త కూడా అయిన ఒక రైతు ఆమె ముందు బహిరంగంగానే ఈ విషయం మీద నిరసనను వ్యక్తం చేశారు. అలాంటి పాస్ బుక్ మీద జగన్ ఫొటో వ్యవహారం మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ బాధ్యతా రాహిత్యంగా, కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలాగా వ్యాఖ్యానించారు.  పట్టాదార్ పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి ఫొటో వుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. నా భూమి పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫొటో ఏంటి అంటే కుదరదని అన్నారు. నా బర్త్ సర్టిఫికెట్ మీద ఎమ్మార్వో సంతకం ఏంటని అడుగుతామా.. ఇది కూడా అంతే అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో నాగేశ్వర్ ఎంత వితండవాదన చేశారంటే, మళ్ళీ జగన్ పొరపాటున అధికారంలోకి వస్తే, నాగేశ్వర్‌ని పిలిచి మరీ పదవి ఇచ్చేంత స్థాయిలో వాదించారు. ఎవరి బర్త్, డెత్ సర్టిఫికెట్ మీదో ఎమ్మార్వో సంతకానికి లేని అభ్యంతరం పట్టాదార్ పాస్ పుస్తకం మీద జగన్ ఫొటోకి ఎందుకని అన్నారు. విద్యాధికుడు అయిన నాగేశ్వర్ మాట్లాడుతున్న ఈ మాటల్లో ఆయన స్వార్థమేదో తొంగి చూస్తోంది తప్ప మరింకేం కనిపించడం లేదు.

సరే, అది నాగేశ్వర్ అభిప్రాయం అని ఊరుకోవచ్చు. కానీ, ఇదే నాగేశ్వర్ కొద్ది రోజుల క్రితం పట్టాదర్ పాసు పుస్తకాల మీద జగన్ ఫొటోలు ముద్రించుకోవడం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. మరి ఆయనే ఇప్పుడు తాను చేసిన వాదనకు పరస్పర విరుద్ధంగా వున్న వాదన ఎందుకు చేశారో, ఏ గూడుపుఠాణీ జరిగిందో!