తల తిరుగుతోందా హరీష్‌రావ్?
posted on May 3, 2024 12:14PM
తెలంగాణలో బిఆర్ఎస్ చచ్చిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం బిఆర్ఎస్ శవయాత్ర జరుగుతోంది. ఆ శవాన్ని మోస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితర నాయకులు శ్మశానం ముందు శవాన్ని కిందకి దించి దింపుడు కళ్ళం ఆశలతో నోటికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. అలాంటి దింపుడు కళ్ళం ఆశలతో అగ్గిపెట్టె మచ్చా హరీష్ రావు శుక్రవారం ఒక మాట మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గడువు ముగిసినా హైదరాబాద్‌ని ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని చూస్తున్నారట, దీనికోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట. చంద్రబాబు ఆటలు సాగకూడదంటే లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ శవానికి ఊపిరి పోయాలట. ఇదీ హరీష్ రావు వెర్షన్.. తెలంగాణ ప్రజలు చాచిపెట్టి కొట్టినా ఈ బిఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదు. ఈ దిక్కుమాలిన పార్టీ ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విభేదాలు రేపి అధికారంలోకి రావాలని మొన్నటి ఎన్నికల సందర్భంగా కూడా ప్రయత్నించింది. అయితే ప్రజలు మాత్రం వీరి ఆటలు సాగనివ్వలేదు. అసలు ఆంధ్ర ప్రజలు మరోసారి హైదరాబాద్‌ని రాజధానిగా కోరుకోవడం లేదు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారు. చంద్రబాబు అయితే పదేళ్ళు అవకాశం వున్నా, అధికారంలోకి వచ్చిన సంవత్సరానికే హైదరాబాద్‌ని వదిలిపెట్టేసి అమరావతికి వెళ్ళిపోయారు. అలాంటి చంద్రబాబు హైదరాబాద్‌ని మరో్సారి ఆంధ్ర రాజధాని చేయాలని చూస్తున్నారని అనడానికి నోరెలా వచ్చిందయ్యా.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరోసారి ఆంధ్ర బూచిని, చంద్రబాబును చూపించి లాభం పొందాలని బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే హరీష్ రావు తల తిరిగినట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ఆంధ్రలో ఆయన బాధలేవో ఆయన పడుతున్నారుగా.. మొన్న ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలోగానీ, ఇప్పటి పార్లమెంట్ ఎన్నికలలోగానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయడం లేదు కదా.. మరి ఇంకా ఎందుకు చంద్రబాబు మీద పడి వీళ్ళు ఏడుస్తున్నారో! ఇక బిఆర్ఎస్ పార్టీ బతికి బట్టకట్టే అవకాశాలు లేవు కాబట్టి, మరోసారి ఆంధ్ర, తెలంగాణ అంటూ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈ పింక్ పిశాచాల పని అయిపోయింది. వీళ్ళ అవాకులు, చెవాకులు తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే మంచింది.