ఉలిక్కిపడ్డ టీఆర్ఎస్



తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రతిపక్షంలోని ఏ పార్టీకి భయపడని టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఒకే ఒక్క పార్టీని చూసి భయపడిపోతున్నారు. ఆ పార్టీ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. ఆ పార్టీ మరేదో కాదు... మావోయిస్టు పార్టీ. మా ప్రభుత్వం ఎజెండా మావోయిస్టుల ఎజెండానే అని టీఆర్ఎస్ అగ్ర నాయకులు ఎన్నిసార్లు ప్రకటించినప్పటికీ మావోయిస్టులు టీఆర్ఎస్ పార్టీని తమ శత్రువుగానే భావిస్తున్నారు. ఆమధ్య జరిగిన ఎన్‌కౌంటర్ కూడా మావోయిస్టుల ఆగ్రహాన్ని పెంచింది. ఇప్పుడు ఆరుగురు టీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేసి తమ ఆగ్రహాన్ని మావోయిస్టులు బయటపెట్టారు. ఈ చర్య టీఆర్ఎస్ నాయకులలో వణుకు మొదలయ్యేలా చేసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి పూర్తిగా మాయమైందని చెప్పవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టులు మెల్లగా బలం పుంజుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుందని మేధావుల మాట నిజమైంది. తెలంగాణ క్రమంగా మావోయిస్టులు విజృంభించి ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే అవకాశాలు వున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో హాయిగా విహరిస్తున్న టీఆర్ఎస్ నాయకులకు ఇకముందు అలా కుదరకపోవచ్చన్న భయాందోళనలు కలుగుతున్నాయి. దశాబ్దాల క్రితం మావోయిస్టులు ఎంతగా రెచ్చిపోయారో మళ్ళీ అలాంటి పరిస్థితులు వచ్చే ప్రమాదం వుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తమ భద్రత ఎలా అనే ఆలోచనలో పడిపోయినట్టు తెలుస్తోంది. బడా నాయకులకు భద్రత ఎలాగూ వుంటుంది. మరి ఛోటా నాయకుల పరిస్థితి ఏమిటి? నిన్న ఖమ్మం జిల్లాలో కిడ్నాపైన టీఆర్ఎస్ నాయకులు ఛోటా నాయకులే. అలాంటి ఛోటా నాయకులను కూడా కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది. వారిని కాపాడుకోలేకపోతే ఆ ప్రభావం ప్రభుత్వం మీద మాత్రమే కాదు.. టీఆర్ఎస్ పార్టీ మీద.. మొత్తం రాష్ట్రం మీద పడే ప్రమాదం వుందని విశ్లేషకులు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu