రైలు ప్రయాణం.. ప్రాణం గాల్లో దీపం !

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంత రాష్ట్రం ఒడిశాలో పట్టాలపై మరణ మృదంగం మోగింది.రెండు రైళ్లు.. గూడ్స్ రైలు ఢీ కొట్టుకొన్న ఘటనలో దాదాపు 300 మంది ప్రయాణికులు  విగత జీవులయ్యారు. మరో 1000 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడి.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.

బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హౌరా వెళ్తున్న బెంగళూరు - హౌరా సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా ఆ రైలుకు చెందిన పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోవడం.. వాటిని షాలిమార్ - చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టడం.. దాంతో ఆ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తా పడ్డడం.. ఆ కొద్దిసేపటికే బోల్తాపడ్డ.. కోరమండల్ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అయితే మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా.. ఊహించనంతగా పెరిగింది. ఈ ప్రమాదాలన్నీ ఒకదాని వెంట ఒకటి కొన్ని నిమిషాల వ్యవధిలో చోటు చేసుకోవడంతో.. అక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలోకి ఇటు స్థానికులు.. అటు ప్రయాణికులు కొన్ని నిమిషాలు పాటు అలా నిశ్చేష్టులై ఉండిపోయినట్లు వెలువడుతోన్న కథనాల ద్వారా అవగతమవుతోంది.  

అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆయా రైల్వే స్టేషన్ల వద్ద సిబ్బంది విదుల్లో ఉన్నారా? ఓ వేళ వారు విధుల్లో  ఉండి ఉంటే.. తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నారా? అనే అంశంపై ఆరా తీయాల్సి ఉంది. అంతే కానీ సాక్షాత్తూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఘటన స్థలానికి చేరుకుని.. ఈ రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు అయితే చెప్పలేమని... ప్రమాద ఘటనపై విచారణ చేసి  చెబతామని... ఈ ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ  ఏర్పాటు చేశామంటూ  చేతులు దులిపేసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు నష్ట పరిహరం అందజేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.   

అయితే కొన్ని దశాబ్దాల క్రితం రైల్వే శాఖ మంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో దేశంలో ఏక్కడో రైలు ప్రమాదం జరిగితే.. అందుకు ఆయన నైతిక బాధ్యత వహిస్తూ... మంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ నేటి రాజకీయ నాయకుల్లో ఆ నీతి.. ఆ నిజాయితీ.. ఆ నైతిక బాధ్యత.. నిబద్దత అనేవి ఎక్కడా దుర్భిణి వేసి వెతికినా.. కానరాని పరిస్థితి అయితే నెలకొందనేది మాత్రం సుస్పష్టం. పోనీ ఈ ప్రమాద ఘటనపై స్థానిక రైల్వే స్టేషన్ సిబ్బందిని రైల్వే మంత్రి ఆరా తీసినా.. ప్రమాద ఘటన వివరాలు వెంటనే వెల్లడించవచ్చు. కానీ సదరు మంత్రిగారికి ఆ ఆలోచన, ఉద్దేశం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయినా భారతీయ రైల్వే.. ఆదాయం కోసం చేసే వేసే ట్రిక్కులకు ట్రాక్ రికార్డు గట్టిగానే ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రయాణికుల అవసరాన్ని.. అత్యవసరాన్ని క్యాష్.. ఎన్ క్యాష్ చేసుకోవడం కోసం.. రైలు టికెట్ ధరలు పెంచు కోవడమే కాదు.. తత్కాల్, ప్రీమియం తత్కాల్ వంటి వాటిని తెరపైకి తీసుకు వచ్చి.. ప్రయాణికులను నిలువు దోపిడి చేయడంలో దేశంలోని అన్ని రైల్వే జోన్లు పోటా పోటీగా   అగ్రస్థానంలో నిలిచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఒలింపిక్స్ మెడల్.. మెడలో వేయాల్సిందేనని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఇక పండగలు, వరుస సెలవుల దృష్ట్యా రైల్వే స్టేషన్లకు పిల్లాపాపలతో ప్రయాణికులు పోటెత్తుతుంటారు. అలాంటి వేళ.. రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫామ్ టికెట్ల ధరలు 10 రూపాయిలు  నుంచి  ఏకంగా 50 రూపాయిలకు పెంచేసిన ఘనత మన రైల్వే శాఖది. అంతేందుకు రైల్వే స్టేషన్ల వద్ద, రైల్వే రిజర్వేషన్ల కౌంటర్ల వద్ద.. వాహనాల పార్కింగ్ ఫీజు సైతం.. అదీ కూడా జీఎస్టీ వడ్డనతో సహా లెక్క కట్టి మరీ వసూల్ చేసి.. వసూల్ రాజాగా రైల్వే శాఖ ఖ్యాతి గాంచింది.

అంతే కాదు.. ఓ సాధారణ మధ్యతరగతి ప్రయాణికుడు.. తన కుటుంబంతో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చి.. రైలులో సాదారణ బోగి ఎక్కి.. ప్రయాణించడం.. ఓ మహా ప్రహనంగా మారిపోయింది. ఇక ఓ ప్రయాణికుడు.. అత్యవసర సమయంలో రైల్వే సమాచారం కోసం రైల్వే స్టేషన్‌కి ఫోన్ చేయాలంటే.. నెంబర్ ఉండదు. అలాగే టోల్ ప్రీ నెంబర్లు కానీ కాన రానీ దుస్థితి నెలకొంది. 

రైల్వే స్టేషన్ల అభివృద్దికి కోట్లది రూపాయిలు వెచ్చించే ఈ ప్రభుత్వాలు.. రిజర్వేషన్ల కౌంటర్ల వద్ద మరింత మంది సిబ్బందిని నియమించే విషయంలో మాత్రం అపరిచితుడిలాగా వ్యవహరిస్తోంది. అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిత్యం.. దేశవ్యాప్తంగా రైళ్లు అటు ఇటు వెళ్తుంటాయి. అలాంటి వేళ.. ప్రతి రైలుకు అటు రెండు...  ఇటు రెండు సాధారణ భోగిలు కాకుండా.. దాదాపు ఆరు నుంచి ఏడు సాధారణ ప్రయాణికుల కోసం బోగీలను ఏర్పాటు చేస్తే.. అత్యవసర ప్రయాణాల్లో ప్రయాణించాల్సిన ప్రయాణికులు సైతం ఎంతొ కొంత ఊరట చెందుతారు. అయితే ఆ దిశగా చర్యలు కాదు కనీసం ఆలోచన కూడా రైల్వే శాఖ చేయడం లేదు.

 అంతే కాదు వందే బారత్.. వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌ల కంటే.. దూర ప్రాంతలకు వెళ్లే రైళ్లకు సాధారణ బోగీల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం.. అవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే సదరు సాధారణ బోగీల్లో.. కొన్ని గంటల పాటు సాగిస్తున్న సామాన్య ప్రయాణికుడు.. నిత్య నరకాన్ని ప్రతి ప్రయాణంలో చవి చూస్తున్నాడనేది ఎవరు కాదన లేని వాస్తవం.