ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం రూ. 1.10 కోట్లు

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నిమజ్జనోత్సవాన్ని ఎటువంటి అవాంతరాలూ లేకుండా సాఫీగా జరిగేలా చూసేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  జంటనగరాల్లో వాడవాడలా కొలువుదీరిన గణేష్ లు నిమజ్జనం కోసం శోభాయాత్రగా తరలుతున్నారు. ఇక ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేశారు.  

శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా 10 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు  గంగమ్మ ఒడికి చేరేందుకు కదిలాడు. 70 అడుగుల ఎత్తులో భారీ కాయుడై..ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన ఖైరతాబాద్ గణేషుడిని టస్కర్ పైకి చేర్చారు. కాగా ఈ ఏడాది  ఖైరతాబాద్ గణపతికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈ సారి ఆదాయంలో ఖైరతాబాద్ వినాయకుడు గత రికార్డులన్నీ బద్దలు కొట్టేశాడు.  ఖైరతాబాద్ మహాగణపతి   ఆదాయం కోటీ 10 లక్షల రూపాయలు వచ్చింది.  ఇందులో హుండీ ద్వారా వచ్చిన ఆదాయం 70 లక్సలు కాగా, హోర్డింగులు, ఇతర ప్రకటనల రూపంలో మరో 40 లక్షలు ఆదాయం వచ్చింది. ఆన్ లైన్ విరాళాలను ఇంకా లెక్కించాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధుడైన ఖైరతాబాద్ గణేషుడికి ఆన్ లైన్ లో కూడా భారీగా విరాళాలు వస్తుంటాయి. అవి కూడా లెక్కించిన అనంతరం ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. 

ఇక బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం ప్రారంభం కావాల్సి ఉంది.  బాలాపూర్ వీధుల్లో ఊరేగింపు అనంతరం గ్రామ బొడ్రాయి వద్ద బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం పాట ప్రారంభం కానుంది. ఈ ఏడాది బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలానికి కొత్త నిబంధనలు పెట్టారు.  గతేడాది వేలంలో గణేషుడి లడ్డూ 27 లక్షల రూపాయలు పలికిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేలంలో గత ఏడాది పలికినంత సొమ్మును అంటే 27 లక్షల రూపాయలను ముందే డిపాజిట్ చేయాలని నిబంధన విధించారు. ఆ సొమ్ము డిపాజిట్ చేసి పెద్ద సంఖ్యలో వేలంలో పాల్గొనేందుకు భక్తులు ముందుకు వచ్చారు. ఇక రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ లో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూ వేలం పాటలో రికార్డు స్థాయి ధర పలికింది. బండ్లగూడ జాగీర్  కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో ఏర్పాటు చేసిన గణేష్ మంటపంలో గణేషుడి లడ్డూ వేలంపాటలో అత్యధికంగా కోటీ 87 లక్షలు పలికింది.