ఒకే ఒక్కడు మోడీనే సర్వం! బీజేపీలో కాంగ్రెస్ కల్చర్

భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ కల్చర్’ ప్రవేశించిందా? సిద్దాంత ప్రాధాన్యత పక్కకు పోయి, వ్యక్తి ఆరాధన ఎత్తు పీట వేసుకు కూర్చుందా? అంటే అవుననే అంటున్నారు, పార్టీ అంతర్గత వ్యవహారాలను దగ్గరగా చూస్తున్న విశ్లేషకులు. నిజానికి, ఇది కొత్తగా ప్రవేశించిన అవలక్షణం కాదు. కేంద్రంలో  మోడీ, షా జోడీ ఎంట్రీతోనే, పార్టీలో వ్యక్తి ఆరాధన ప్రవేశించిందని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. 

అంతవరకు ఇతర పార్టీలకు భిన్నంగా, ‘పార్టీ విత్ ఏ డిఫరెన్స్’ అన్నట్లుగా ఉన్నపార్టీ, మెల్లమెల్లగా రాజకీయ  మందలో చేరిపోయిందని, పాతతరం సీనియర్ నాయకులు ఎప్పటినుంచో అంటూనే ఉన్నారు. ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంలో అయితే నేమి, ముఖ్యమంత్రులను మార్చడంలో అయితేనేమి, ఇతర పార్టీల నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులను తమ పంచన చేర్చుకోవడంలో అయితే నేమి, ఇలా... ఇతర మధ్యేవాద, ప్రాంతీయ పార్టీల అవలక్షణాలు అన్నీ, మోడీ, షా నాయకత్వంలో బీజేపీ కూడా అలవరచుకుంది. నిజానికి ఆ అవలక్షణాలు కాంగ్రెస్ లో కంటే బీజీలోనే ఎక్కువగా పాదుకు పోయాయి.ఈ విషయంలో పార్టీలోనే కొందరు నేతలు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే, గెలుపు కోసం కట్టు తప్పినా పర్వాలేదనే వాదన పార్టీలో బలపడింది. బీజేపీ కూడా రాజకీయ పార్టీనేగానీ, సన్యాసి మఠం కాదు, రాజకీయాలే చేస్తుందనే  సమర్ధింపు స్వరాలూ ఇప్పుడు పెద్దగా వినిపిస్తున్నాయి. 

అదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమైన నేపధ్యంలో, పార్టీ వ్యవహారాల్లోనూ మోడీ ప్రత్యక్ష ప్రమేయం కోరుకుంటున్నారా, అనే అనుమానాలు పార్టీ వర్గాల్లోనే  వినవస్తున్నాయి. ఒకప్పుడు ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీలో రెండవ అదికార కేంద్ర లేకుండా జాగ్రత్త పడ్డారు. ప్రధానిగా, పార్టీ అధ్యక్షరాలుగా ఆమె ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పడు మోడీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారా, అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పార్లమెంట్ సమావేశాలు జరిగే సందర్భంగా పార్టీ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్ షా, అలాగే ప్రధాని మోడీ, రాష్ట్రాల వారీగా ఎంపీలతో విడివిడిగా సమావేశం కావడం ఆనవాయతీగా వస్తోందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు (బుధవారం) దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారని,అంతకు మించి ప్రత్యేక ప్రాధాన్యత లేదని అంటున్నారు.

ప్రధాని నివాసంలో ఈరోజు మూడు దక్షిణాది రాష్ట్రాల ఎంపీలకు  అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులపై ఎంపీలతో మోదీ పిచ్చాపాటి నిర్వహించారని పార్టీ నేతల సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, కేంద్ర పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం అంశాలపై ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేశారని, సమావేశాని హాజరైన ఎంపీలు చెపుతున్నారు. అయితే, ఇటీవల కాలంలో మోడీ, షా మధ్య దూరం పెరిగిన నేపధ్యంలో పార్టీ వ్యవహారాలఫై ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలఫై మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారని అంటున్నారు. పార్టీ మొత్తాన్ని తం గుప్పిట్లోకి తీసుకునేందుకు మోడీ సిద్దమవుతున్నారనే మాట కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది.