టాలీవుడ్ సపోర్టు తెలుగుదేశం కూటమికే!

ఆంధ్రప్రదేశ్ లో  మే 13న పోలింగ్ జరగనుంది. శనివారం (మే 11) సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది.  ఎన్నికల ప్రచారంలో సినీ తళుకులు ఈ సారి పెద్దగా కనిపించలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తెలుగుదేశం కూటమికి సామాజిక మాధ్యమం ద్వారా తెలుగుదేశం కూటమికి మద్దతు ప్రకటించారు. హిందూపురం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ పోటీలో ఉన్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. వీరిరువురికీ వారి అభిమానుల మద్దతు ఎటూ ఉంటుంది. అలాగే నందమూరి హీరోల మద్దతు బాలయ్యకు, మెగా హీరోల సపోర్టు పవన్ కల్యాణ్ కు  ఉంటుంది.

పవన్ కల్యాణ్ తరఫున మెగా హీరోలు సాయిధర్మతేజ,  వైష్ణవ్ తేజ్, నాగబాబు వంటి వారు ప్రచారం చేశారు. మెగా స్టార్  చిరంజీవి.. తన తమ్ముడు పవన్ కి, కూటమికి మద్దతు తెలుపుతూ ప్రత్యేక వీడియోలు విడుదల చేశారు. రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించాడు. అలాగే అల్లు ఫ్యామిలీ కూడా మద్దతు తెలిపింది. పవన్ కే తమ ఫుల్ సపోర్ట్ అని.. అల్లు అరవింద్, అల్లు అర్జున్ ప్రకటించారు.ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ కూడా జనసేన తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే నందమూరి బాలకృష్ణ తరఫునా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రచారం చేశారు. అన్నిటికీ మించి బాలకృష్ణ కూటమి తరఫున సీమ మెత్తం తిరిగి చేసిన ప్రచారానికి భారీ స్పందన  అభించింది. అదే విధంగా కూటమి భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ అభ్యర్థుల తరఫున హీరో విక్టరీ వెంకటేష్, రెబల్ స్టార్ కృష్ణం రాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ ప్రచారం చేశారు.  

నందమూరి, మెగా, అల్లు, దగ్గుబాటి, రెబెల్ స్టార్ కుటుంబాలే కాకుండా  కూటమికి సపోర్ట్ చేస్తున్న సినీ ప్రముఖుల జాబితా భారీగానే ఉంది. అలాగే  హీరోలు నాని, తేజ సజ్జ, నిఖిల్, నారా రోహిత్, రాజ్ తరుణ్, సీనియర్ నటులు నరేష్, సురేష్.. కమెడియన్స్ సప్తగిరి,  జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, కిరాక్ ఆర్పీ వంటి వారు కూటమికి మద్దతు ప్రకటించారు.  వీరే కాకుండా ఇంకా ఎందరో నటీనటులు, దర్శకనిర్మాతలు తమ మద్దతు కూటమికే అని స్పష్టం చేశారు. టాలీవుడ్ విషయంలో జగన్ వ్యవహరించిన తీరు కారణంగా..  అధికార పార్టీపై సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున  వ్యతిరేకత వ్యక్తమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వైసీపీ తరఫున ఈ సారి సినీ పరిశ్రమ నుంచి పెద్దగా ఎవరూ మద్దతు పలికిన దాఖలాలు లేవు. వైసీపీలో ఉన్నప్పటికీ ప్రముఖ కమేడియన్ అలీ అసలు పార్టీ తరఫున ప్రచారానికి దూరంగా ఉన్నారు. అలాగే ఆ పార్టీ తరఫున పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశాల్లో మాట్లాడడానికే పరిమితమయ్యారు.