మారిన ఐఏఎస్, ఐపీఎస్ ల తీరు.. అధికారం ఎవరిదో తేలిపోయినట్లేగా?
posted on May 20, 2024 3:06PM
జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై అధికారం కోల్పోతుందా వంటి ప్రశ్నలకు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్వేల మీద ఆధారడుతుంది. అయితే విషయాన్ని సర్వేలతో సంబంధం లేకుండా జనం మూడ్ ఏమిటి, ఎన్నికలలో విజయం సాధించే పార్టీ ఏది? పరాజయం పాలయ్యే పార్టీ ఏది అన్న విషయాన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులు ముందుగానే పసిగట్టేయగలరు. ఔను రాజకీయ పరిభాషలో బాబూస్ గా పిలవబడే ఐఎస్ఎస్ అధికారులకు జనం నాడి అందరికంటే ముందే తెలిసిపోతుంది.
అందుకే ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మరో సారి గద్దె నెక్కే పరిస్థితి లేదని వారు ఎప్పుడో పసిగట్టేశారు. వారి విధేయతను మార్చేయడానికి, ప్లేటు ఫిరాయించడానికి ఎప్పుడో రెడీ అయిపోయారు. అయితే అతి కొద్ది మంది మాత్రం తమ విధేయతలను మార్చినా ఫలితం లేని స్థితికి వచ్చేశారు. జగన్ అక్రమ పాలనలో, నిబంధనలను తుంగలోకి తొక్కి అడ్డగోలు విధానాలను అమలు చేయడంలో జగన్ తో అంటకాగి నిండామునిగిపోయిన వారు మాత్రం నిండా మునిగిన వాడికి చలేమిటి అన్నట్లుగా ఎన్నికల కోడ్ ను సైతం లెక్క చేయకుండా అధికార పార్టీ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారు. మిగిలిన వారు మాత్రం ఇప్పుడు తమ ఉద్దేశం ప్రకారం రాబోయేది తెలుగుదేశం కూటమి సర్కారే అన్న నిర్ధారణకు వచ్చేశారు.
ఇప్పటి వరకూ తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరించిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులు, కొందరు ఐపీఎస్ అధికారులు కాబోయే సీఎం అన్న నమ్మకానికి వచ్చేసి చంద్రబాబు ప్రాపకం కోసం తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. అసలు బాబూస్ లో ఈ ప్రయత్నాలు ఎప్పుడో ఆరేడు నెలల కిందటే మొదలయ్యాయి. ఇప్పుడు అవి మరింత ముమ్మరమయ్యాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబుతో కాంట్రాక్ట్ లోకి వెళ్లి మరీ తమ సచ్ఛీలతను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలీ ఒరవడి ఆరేడు నెలల కిందటే మొదలైంది.
ఇంత కాలం జగన్ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆరేడు నెలల నుంచీ జగన్ సర్కార్ కు దూరం జరగడం మొదలైంది. ఇంత కాలం జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చిన చందంగా ప్రభుత్వం ఇంత చెప్తే అంత చేసి విపక్షాన్ని చీకాకు పెట్టేందుకు మాత్రమే తమ అధికారాన్ని వాడిన అధికారుల వైఖరి గత ఆరేడు నెలలుగా పూర్తిగా మారిపోయింది. వి జగన్ కరుణా కటాక్షాల కోసం పరిధి దాటి మరీ పనులు చేసిన కొందరు అధికారులు గత ఆరేడు నెలల నుంచీ చంద్రబాబుతో భేటీకి తహతహలాడుతున్నారు.
కొందరైతే రహస్యంగా ఆయనను కలిసి క్షమాపణలకు కోరుకోవడమే కాదు.. అలా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందో వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఒక సందర్భంలో చంద్రబాబు ఈ విషయాన్నిస్వయంగా చెప్పారు. ఒక సీనియర్ అధికారి తనను మారువేషంలో కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి వివరించారనీ, తానేం చేయలేకపోతున్నానని మధనపడ్డారనీ, ఎదిరిస్తే ప్రాణాలకే ముప్పని భయపడ్డారని చంద్రబాబు చెప్పారు. అంటే కేవలం జగన్ ఒత్తిడితోనే తాము తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పని చేయాల్సి వచ్చిందని అధికారులు చెప్పుకున్నారు.
బరితెగించి మరీ ఇంత కాలం జగన్ కు భజన చేసిన అధికారులే బాబు ప్రాపకం కోసం వెంపర్లాడారు. ఇప్పుడు ఎన్నికల ముగిసిన తరువాత మరింత మంది అదే బాటలో నడుస్తున్నారు. బాబూస్ మారిన వైఖరే రాష్ట్రంలో ప్రభుత్వం మారోబోందన్న సంకేతాలను బలంగా ఇస్తున్నది.
అయితే జగన్ ప్రాపకం కోసం పరిధి దాటి వ్యవహరించి తెలుగుదేశం శ్రేణులనూ నేతలనూ వేధింపులకు గురి చేసిన ఐఏఎస్, ఐపీఎస్ లకు ఇప్పుడు బాబు ప్రాపకం కోసం వెంపర్లాడే ధైర్యం రావడానికి కారణం.. ఇప్పుడు సర్వీస్ అధికారుల తీరే రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం కూటమిదేనన్న భావనను బలపరిచేదిగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.