వైసీపీ హయాంలో శ్రీవారి ఖజానాకూ శఠగోపం.. నిగ్గుతేల్చిన విజిలెన్స్ నివేదిక

వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో రాష్ట్రంలో అవినీతి తార స్థాయిలో జ‌రిగింది. ఆ పార్టీ నేత‌లు అన్ని విభాగాల్లో పోటీలు ప‌డి మ‌రీ అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారు. ప్ర‌జ‌ల సొమ్మును అందిన కాడికి దోచుకున్నారు. తెలుగుదేశం కూట‌మి  అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ అక్ర‌మాల‌పై  ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌ మేరకు  ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రిపి అవినీతిపరులు, అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించింది.  

వైసీపీ నేత‌లు క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామినీ వ‌ద‌ల్లేదు. తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామి అంటే హిందూవుల‌కు అపార‌మైన న‌మ్మ‌కం. స్వామివారిని ద‌ర్శించుకునేందుకు రోజుకు 80వేల నుంచి ల‌క్ష మంది వ‌ర‌కు తిరుమ‌ల‌కు వ‌స్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక‌.. దేశం న‌లుమూల‌ల నుంచీ, ఇత‌ర దేశాల నుంచి హిందువులు తిరుమ‌ల కొండ‌కు వ‌స్తుంటారు. అలాంటి తిరుమ‌ల‌లోనూ వైసీపీ ఐదేళ్ల‌ హ‌యాంలో అవినీతి అక్ర‌మాలు పెద్ద ఎత్తున జ‌రిగాయి.  దేవుడి సొమ్మును యథేచ్ఛగా దోచేశారు. సీఎంగా చంద్ర‌బాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టాక శ్రీవారి దర్శనానికి వచ్చిన సంద‌ర్భంలో  రాష్ట్రంలో  ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తానని ప్రకటించారు. ఆర్థిక పరమైన అక్రమాలను నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర విజిలెన్స్‌ విభాగం నుంచి ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో వివిధ శాఖలకు చెందిన 40 మంది అధికారుల బృందం తిరుమలతిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలపై విచారణ జ‌రిపింది. వారి విచార‌ణ‌లో విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి.  

వైసీపీ హ‌యాంలో హిందువులు ఎంతో ప‌విత్రంగా భావించే తిరుమ‌ల‌ కొండ‌పై పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని ఆధారాల‌తో స‌హా గుట్టుర‌ట్ట‌ు చేసింది. దీనికి తోడు తిరుమ‌ల‌లో అన్న‌ప్ర‌సాదాల్లో నాణ్య‌త లేక‌పోవ‌టం, ల‌డ్డూలోనూ నాణ్య‌త తగ్గ‌డంతో గ‌తంలో భ‌క్తులు ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ల‌డ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్య‌త‌  పెంచింది.  అయితే వైసీపీ హయాంలో తిరుమల  లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని వాడార‌ని వెలుగులోకి రావ‌డంతో హిందువులు తీవ్ర స్థాయిలో ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు. వైసీపీ నేత‌లు కాసుల కోసం  ఇంతటి అపచారానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన కొద్దిరోజుల‌కే ఈ నెయ్యి వాడ‌కాన్ని నిలిపివేశారు. 

అయితే వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదం క్వాలిటీ తగ్గిపోవడానికి కారణాలు  తెలుసుకునేందుకు తెలుగుదేశం కూటమి ప్ర‌భుత్వం ఓ క‌మిటీ వేసింది. ల‌డ్డూకు వినియోగించే నెయ్యి సహా ఇతర పదార్థాల శాంపిల్స్ ను టెస్టింగ్‌కు దేశంలోని అత్యున్నత ల్యాబ్‌లకు పంపారు. ఆ ల్యాబ్ రిపోర్టుల్లో ల‌డ్డూలకు వాడిని నెయ్యిలో అసలు నెయ్యి 19శాతమే.  బీఫ్ కొవ్వు, ఫిష్ ఆయిల్ సహా..ఇతర వ్యర్థాలన్నీ మిగతా మొత్తం ఉన్నాయి. అంటే ఇది అసలు నెయ్యే కాదు. ఇదే విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు రెండు రోజుల కిందట వెల్ల‌డించారు. మ‌రుస‌టి రోజు ప్ర‌భుత్వం ఇందుకు సంబంధించిన రిపోర్టుల‌ను  బ‌హిర్గతం చేసింది. 

తిరుమ‌ల కొండ‌పై వైసీపీ నేత‌ల అవినీతి అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తుండ‌టంతో భ‌క్తులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ల‌డ్డూ ప్ర‌సాదంలో, అన్న‌ప్ర‌సాదంలో నాణ్య‌త‌లేక‌పోవ‌టం, మండ‌పాల‌ ఇంజినీరింగ్ ప‌నుల విష‌యంలో.. త‌దిత‌ర విభాగాల్లో గత ఐదేళ్లలో టీటీడీలో భారీగా అవకతవకలు జరిగినట్లు పలువురు భక్తులతోపాటు బీజేపీ, జనసేన నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని ప్రభుత్వం స్టేట్ విజిలెన్స్ అధికారులను ఆదేశించడంతో ఈ ఏడాది జూన్ 25వ తేదీ నుంచి అధికారులు టీటీడీలో సోదాలు నిర్వహించారు. ప్రధానంగా వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పాలక మండళ్లు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి రూ. వేల కోట్ల నిధులను కేటాయించడంలో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ముడి సరుకులు కొనుగోళ్లు, శ్రీవారి దర్శనం టిక్కెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో జరిగిన అక్రమాలపై అధికారులు దృష్టి సారించి ఆ విభాగాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహంచి పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా.. శ్రీవారి ఖజానాకు సుమారు రూ. 5వందల కోట్లకుపైగా గండి పడిందని రాష్ట్ర విజిలెన్స్ అధికారులు నిర్దారించారు. గత రెండున్నర నెలలుగా టీటీడీలోని పలు విభాగాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. టీటీడీలోని 18 విభాగాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.

దీంతో జగన్ అధికారంలో ఉండగా దేవదేవుని విషయంలో జరగని అపచారం లేదు.  హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం జగన్ అధికారంలో ఉన్నంత కాలం ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందంటూ హిందూ ధర్మ సంస్థలు ఈ విషయాన్ని అప్పట్లో పదే పదే చెప్పాయి. ఆరోపించాయి. ఫిర్యాదులు చేశాయి. ఆవేదన వ్యక్తం చేశాయి. ఇప్పుడు నాటి ఆరోపణలన్నీ అక్షర సత్యాలని నిర్ద్వంద్వంగా తేలింది. ఇక ఇప్పుడు జరగాల్సింది ఆ అపచారాలకు కారకులు, బాధులు అయిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవడమే.