మీరు శక్తివంతమైన వ్యక్తులుగా మారాలి అనుకుంటున్నారా? ఈ పనులు మానేయండి..!

 


శక్తివంతంగా ఉన్న వ్యక్తులు జీవితంలో ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కోగలుగుతారు. ప్రతి ఒక్కరు శక్తివంతంగా ఉండాలని, తమ జీవితాన్ని గొప్పగా అభివృద్ది చేసుకోవాలని, ఇతరుల మీద ఆధారపడటం, సొంతంగా ఏ పని చేయలేకపోవడం,  ప్రతి దానికి సందేహించడం వంటి సమస్యలను అధిగమించాలని అనుకుంటూ ఉంటారు.  అయితే వీటిని అధిగమించడం అంత సులువు కాదు.  కానీ కొన్ని పనులను మానేయం ద్వారా జీవితంలో శక్తివంతంగా మారవచ్చు. ఇలా మారితే గనుక జీవితం మరొక స్థాయికి వెళుతుంది.  అందరూ మీరు శక్తివంతమైన వారని,  గొప్పవారని తప్పకుండా ఒప్పేసుకుంటారు.  ఇందుకోసం ఏ పనులు మానేయాలో తెలుసుకుంటే..

ఆలోచన..

ఆలోచన అందరికి ఉంటుంది.  అయితే ఆ ఆలోచనకు కూడా ఒక పరిధి ఉంటుంది.   ఆలోచించాల్సిన విషయాల గురించి ఆలోచిస్తే పర్వాలేదు. కానీ చిన్న చిన్న విషయాలను కూడా కొందరు అతిగా ఆలోచిస్తారు.  ఈ కారణం వల్ల చాలా వరకు ఆందోళన పెరుగుతుంది.  అందుకే చిన్న విషయాలకు ఆలోచించడం,  అతిగా ఆలోచించడం మానేయాలి.

ఇతరులు..

ప్రతి వ్యక్తి జీవితంలో ఎవరో ఒకరు ప్రధాన పాత్ర పోషిస్తారు. అయితే ఇతరుల మీద ఎక్కువ ఆశ పెట్టుకోవడం మంచిది కాదు.  ఏ విషయంలో అయినా సరే.. ఇతరుల మీద ఆశ, నమ్మకం పెట్టుకుని ఉంటారో.. అలాంటి వారికి నిరాశ ఎదురవుతుంది. అందుకే ఎవరి మీద ఆశ పెట్టుకోకూడదు.

మాట్లాడటం..

మాట్లాడటం ఒక కళ అంటారు.  అయితే అందరితో ఒకే విధంగా మాట్లాడటం సరైనది కాదు.. పరిస్థితి బట్టి,  విషయాన్ని బట్టి మాట్లాడే విధానం వేరుగా ఉండాలి. ఎవరి దగ్గర ఏ విషయాన్ని మాట్లాడాలి? ఏ విషయాన్ని మాట్లాడకూడదు అనేది తెలుసుకోవాలి. అలాగే ఎవరితో అంటే వారితో అర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలి.  మాటలను చాలా పొదుపుగా వాడాలి. అప్పుడే హుందాగా ఉంటారు.

సరదా..

కొందరికి సరదాగా ఉండటం అలవాటుగా ఉంటుంది. అయితే అందరితో ఇలా సరదాగా ఉండటం కుదరదు.  ఎందుకంటే అందరూ ఈ సరదా తనాన్ని ఇష్టపడరు. అంతేకాదు.. ఇలా సరదాగా మాట్లాడటాన్ని కొందరు అవమానంగా చూస్తారు.  అందుకే అందరితో సరదా పనికిరాదు.

వస్త్రధారణ..

వేసుకునే దుస్తులు,  తయారయ్యే విధానం కూడా చాలా సార్లు వ్యక్తులను హుందాగా,  గౌరవంగా నించోబెడుతుంది. అందుకే మనిషి వ్యక్తిత్వం ముఖ్యం,  దుస్తులది ఏముందిలే లాంటి డైలాగులు కట్టిపెట్టి చక్కగా రెడీ అవ్వాలి.

ప్రాధాన్యత..

ఇతరులకు ప్రాధాన్యత ఇస్తూ ఇతరుల కోసం సమయాన్ని అడ్జెస్ట్ చేసుకునే వారిని చూసి ఉంటారు. కానీ అది తప్పు. ఎప్పుడూ ఇదే అలవాటు మంచిది కాదు.  తమను తాము పట్టించుకుంటూ, తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఉంటే అప్పుడు ఇతరులు కూడా గౌరవిస్తారు,  మీ ప్రాధాన్యతను ఇతరులు గుర్తిస్తారు. అందుకే ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు.  మీ గురించి మీరు కేర్ తీసుకున్న తరువాతే ఇతరుల గురించి ఆలోచించాలి.

                                              *రూపశ్రీ