ఉప ఎన్నికలు వచ్చేస్తున్నాయ్!

తెలంగాణ ఉప ఎన్నికలు వచ్చేస్తున్నాయా? అంటే  అవుననే సమాధానమే వస్తోంది. అవును. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్    ఈ సంవత్సరం ఆరంభంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పటి  నుంచి  రాష్ట్రంలో ఆ పది స్థానాలకూ ఉప ఎన్నికలు తప్పవనే చర్చ గట్టిగా వినిపిస్తోంది. 

అయితే  అదే సమయంలో పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించక పోవచ్చని  ఫిరాయింపు పేగులు మెళ్ళో వేసుకున్న ఖైరతాబాద్  బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ, లోక్ సభ ఎన్నికలలో సికింద్రాబాద్  నుంచి కాంగ్రెస్ టికె పై పోటీ చేసిన దానం నాగేందర్, వరగల్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన కడియం కుమార్తె  కావ్య కోసం కాంగ్రెస్ లో చేరి బహిరంగంగా  ఆమె తరపున  ప్రచారం చేసిన స్టేషన్ ఘానాపూర్ ఎమ్మెల్యే, కడియం శ్రీహరి మీద మాత్రమే అనర్హత వేటు  పడుతుందని, మిగిలిన ఎనిమిది మంది పైనా వేటు పడక పోవచ్చని భావించారు. 

అయితే  సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా  సుప్రీం కోర్టు ధర్మాసంనం చేసిన కొన్ని వ్యాఖ్యలు  ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రటించే విషయంలో స్పీకర్ నిర్ణయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని స్పీకర్ తరపు న్యాయవాది  ముకుల్  రోహిత్  ను ప్రశ్నించడమే  కాకుండా  స్పీకర్ సమాధానికి గడవు విధిస్తూ అసెంబ్లీ స్పీకర్ , అసెంబ్లీ కార్యదర్శి, ప్రభుతం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జరీ చేయడంతో  మొత్తం పదిమందిపై వేటు తప్పదని భావించారు. 
అందుకే  బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నికలు అనివార్యం అనే నిర్ణయానికి వచ్చారు. ఉప ఎన్నికలకు  రె..ఢీ అంటున్నారు. ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశంలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  ఉప ఎన్నికలు వస్తున్నాయని ప్రకటించారు. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా పోరుకు సిద్ధం కావాలని పార్టీ నాయకులను ఆదేశించారు.  అలాగే  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పటి కప్పుడు, ఎక్కడంటే అక్కడ  దమ్ముంటే  పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి కాంగ్రెస్ టికెట్  పై గెలిపించుకోవాలని సవాలు విసురుతున్నారు. 

మరో వంక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాజసభ సభ్యుడు కే.లక్ష్మణ్  ఇతర నేతలు ఉప ఎన్నికలు అనివార్యమని, ఎప్పటికప్పుడు జోస్యం చెపుతున్నారు. గెలుపు   ధీమా వ్యక్త పరుస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఉపాద్యాయ,పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కమల దళం నేతలు ఉప ఎన్నికలలో విజయం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. బండి సంజయ్ అయితే పదింట ఏడు మావే’ అని ధీమా వ్యక్త పరిచారు. అలాగే  తెలంగాణ రాజకీయ పరిణామాలను ప్రత్యేక శ్రద్ధతో  గమనిస్తున్న  బీజేపీ జాతీయ నాయకత్వం కూడా పది నియోజక వర్గాల్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక  బృందాలను సిద్దం చేసిందని   పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 
ఇదంతా ఒకెత్తు అయితే  అనేక కోణాల్లో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వ్యూహాత్మకంగా ఉప ఎన్నికలలో సత్తా చాటుకోవడం ద్వారా పార్టీ అంతర్గత  బహిర్గత ప్రత్యర్ధులకు సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే సుప్రీం కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో ఎంపిక చేసిన కొందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే  ఎటూ అనర్హతవేటు వేటు తప్పదని నిర్ణయానికి వచ్చిన   మాజీ మంత్రి కడియం శ్రీహరి ని ఓపెనింగ్ బాట్స్మెన్  గా  బరిలో దించుతున్నారని అంటున్నారు.   

అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉరమని ఉరుములా  ఆదివారం( మార్చి 16)  స్టేషన్ ఘనపూర్  నియోజకవర్గం పై వరాలను కుంభవృష్టిగా  కురిపించారని అంటున్నారు. స్టేషన్ ఘనపూర్ లో ప్రజాపాలన – ప్రగతి బాట  పేరిట  నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి  రేపో మాపో వచ్చే ఎన్నికల కోసం ఈ సభ ఏర్పాటు చేయలేదని  అనడం ద్వారా  ఉప ఎన్నిక  వస్తోందనే సంకేతం ఇవ్వకనే ఇచ్చారని అంటున్నారు. ఇంచుమించుగా 50 వేల మందితో    నిర్వహించిన  భారీ బహిరంగ సభ ఎన్నికల సభను తలపింప చేసిందని అంటున్నారు. అంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం ఒకటైతే, ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి  ఓ వంక  ఖాజాన నిండుకుందని అంటూనే ఒకే ఒక్క నియోజక వర్గానికి  రూ. 800 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులకు వర్చువల్ గా ఒకే వేదిక నుంచి శంకుస్థాపనలు చేశారు. మరో వంక ఎమ్మెల్యే కడియం శ్రీహరి  మరో కోర్కెల చిట్టాను ముఖ్యమంత్రి, ముందు పెట్టారు. అంటే  మొత్తంగా చూస్తే ఓ వెయ్యి కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నవ్వుతూ తల  ఊపడం ఉప ఎన్నికల వస్తున్నాయి అనేందుకు మరో స్పష్ట మైన సంకేతం అంటున్నారు.

అలాగే గతంలో హుజురా బాద్  మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా  కేసీఆర్ అమలు చేసిన వ్యూహాన్నే రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారని అంటున్నారు. ఉద్యకాలం నుంచి కేసీఆర్ ఉప ఎన్నికలను పబ్లిక్ పల్స్ తెలుసుకునేదుకు ఒక పరీక్షగా , ప్రత్యర్ధులకు చెక్  పెట్టే  ఒక అస్త్రంగా ఉపయోగిస్తూ వచ్చారు. ఇప్పడు రేవంత్ రెడ్డి కూడా అదే  ఆలోచనతో ముందుకు పోతున్నారని అంటున్నారు.  

అయితే  కడిం శ్రీహరి రాజీనామా చేసినా వెంటనే ఉప ఎన్నిక వస్తుందా  అంటే అనుమానమే అంటున్నారు. రాజీనామా చేసిన తర్వాత, ఎన్నికల సంఘం వేకెన్సీ  నోటిఫై చేసిన ఆరు నెలల లోపు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది.  ఈ లోగా  పార్టీ ఫిరాయించిన మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు అటో ఇటో తేలిపోయినా తేలిపోవచ్చును. అప్పడు,మొత్తం పది స్థానలకు ఒకేసారి ఎన్నికలు వచ్చినా రావచ్చును  అంటున్నారు. అదో ఇదో ఏది జరిగినా ఉప  ఎన్నికకు రంగం అయితే సిద్దమవుతోంది. ఎప్పుడు ఎన్ని స్థానాలకు అనేదే తెలియాల్సి ఉందంటున్నారు.