మూడు అంత ఈజీ కాదు.. ఫ్రంట్‌పై పీకే క్లారిటీ..

ఓవైపు థర్డ్ ఫ్రంట్ ఊహాగానాలు. అంత‌లోనే కాదు కాద‌నే సందేశాలు. బీజేపీకి వ్య‌తిరేకంగా ప్రాంతీయ పార్టీల ప్ర‌య‌త్నాలు. అదంత ఈజీ కాదంటూ ప్ర‌శాంత్ కిషోర్ స్టేట్‌మెంట్లు. ఇలా దేశంలో పొలిటిక‌ల్ క‌న్ఫ్యూజ‌న్ ఓ రేంజ్‌లో నెల‌కొంది. మంగ‌ళ‌వారం నాటి మీటంగే ఈ గంద‌ర‌గోళానికి కార‌ణం. బీజేపీ వ్య‌తిరేక భావ‌సారుప్య నేత‌లంతా స‌మావేశం అయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అదితో థ‌ర్డ్ ఫ్రంట్ మీటింగ్ అంటూ బ్రేకింగ్ న్యూస్ మొద‌లైపోయింది. మోదీపై మంట మీదున్న వారంతా తెగ ఖుషీ అయ్యారు. అయితే, మంది పెరిగితే మ‌జ్జిగ ప‌ల‌చ‌న అన్న‌ట్టు.. అప్పుడే ఆ మీటింగ్‌లో అంత ప‌స లేదంటూ ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్నాయి. అవి కూడా కీల‌క నేత‌ల నుంచి రావ‌డంతో అస‌లేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.

కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కొంత‌మంది కీల‌క నేత‌ల‌తో ఓ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో రాజకీయ నేతలు, మేధావులు. సినీ, మీడియా ప్రముఖులు పాల్గొంటుండ‌టంతోర మీటింగ్‌కు ఎక్క‌డ‌లేని ప్రాధాన్య‌త వ‌చ్చింది. ఇది థ‌ర్డ్ ఫ్రంట్‌కు శుభారంభం అంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే, తాము తృతీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం మీటింగ్ ఏర్పాటు చేయడం లేదని, ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకే దీన్ని నిర్వహిస్తున్నామని ఆ త‌ర్వాత‌ శరద్ పవార్ క్లారిటీ ఇవ్వ‌డంతో ఉత్సాహం నీరుకారిపోయింది. 

ఇది తాను 2018లో ఏర్పాటు చేసిన పొలిటికల్ యాక్షన్ గ్రూప్- రాష్ట్ర మంచ్ సమావేశం మాత్ర‌మేనంటూ బీజేపీ మాజీ నేత, తృణమూల్ కాంగ్రెస్ నాయ‌కుడు యశ్వంత్ సిన్హా తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎదుర్కోవడానికి తృతీయ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు, ఈ సమావేశానికి సంబంధం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. జేడీ-యూ నేత పవన్ వర్మ దీనిపై వివరణనిస్తూ..ఈ సమావేశానికి బీజేపీని తప్ప అన్నివర్గాల వారిని ఆహ్వానించామన్నారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్.వై.ఖురేషీ, మాజీ రాయబారి కె.సి.సింగ్, సినీ గీత రచయిత జావేద్ అఖ్తర్, చిత్ర నిర్మాత ప్రీతిష్ నంది, మీడియా ప్ర‌ముఖుడు కరణ్ థాపర్, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తదితరులు ఇందులో పాల్గొన‌నున్నారు. 

అయితే, కొన్ని రోజుల ముందు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌, శ‌ర‌ద్ ప‌వార్‌ల మ‌ధ్య సుదీర్ఘంగా చ‌ర్చ జ‌ర‌గ‌డం.. ఆ త‌ర్వాత ప‌వార్ నేతృత్వంలో ఈ స‌మావేశానికి ఏర్పాట్లు చేయ‌డంతో ఇది బీజేపీ యేత‌ర కూట‌మి మీటింగ్‌గానే భావించారు అంతా. కానీ, ప్ర‌శాంత్ కిశోర్ మాత్రం ఇలాంటి ప్ర‌చారానికి ఆదిలోనే బ్రేకులు వేశారు. తాను థర్డ్ ఫ్రంట్ కు సంబంధించి ఏ సమావేశానికి హాజరయ్యే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. బీజేపీని ఎదుర్కోవడానికి ఇలాంటి ఫ్రంట్.. స‌రిపోద‌ని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. బీజేపీని.. థర్డ్ ఫ్రంట్ లేదా ఫోర్త్ ఫ్రంట్ లు.. గట్టి సవాలు ఇవ్వ‌గ‌ల‌వ‌ని తాను భావించ‌డం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు ప్ర‌శాంత్ కిశోర్‌.