చిక్కుల్లో ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్! 

కొన్ని రోజులుగా వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆయనపై ఏకంగా గవర్నర్ కే ఫిర్యాదు వెళ్లింది. సీఐడీ అధికారి పీవీ సునీల్ కుమార్, అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబులపై చట్టబద్ధమైన చర్యలను తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలని దళిత యువతను వీరిద్దరూ ప్రోత్సహిస్తున్నారని లేఖలో వర్ల రామయ్య ఆరోపించారు.

ఉగ్రవాదుల చర్యను సమర్ధించిన ఇరువురిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి తాను ఫిర్యాదు చేశానని... అయినప్పటికీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తన లేఖలో వర్ల రామయ్య  అసహనం వ్యక్తం చేశారు. సివిల్ కాండక్ట్ రూల్స్ ను ఉల్లంఘించి, ఉగ్రవాదులను సమర్థించే విధంగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు అధికారులపై రాజద్రోహం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వర్ల రామయ్య ఫిర్యాదుపై గవర్నర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. 

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై ఇటీవలే నర్సాపురం ఎంపీ రఘురామ కేంద్రానికి, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామ రాజు ఫిర్యాదుతో ఆయన పోస్టింగ్ ఊస్టింగ్ కావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవలే ఏపీ సీఐడీ సునీల్ కుమార్ కు సంబంధించి మరో సంచలన అంశం వెలుగులోనికి వచ్చింది. సునీల్ కుమార్ రిజర్వేషన్ ద్వారా తన ఉద్యోగానికి ఎన్నికయ్యారు. అయితే, భారత రాజ్యాంగం ప్రకారం… క్రిస్టియన్ మతం స్వీకరించిన వారికి రిజర్వేషన్లతో వచ్చిన ఉద్యోగాలు పోతాయి. ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఇటీవలే కోర్టులు కూడా తీర్పులిచ్చాయి. మతం మారితే ఉద్యోగం కోల్పోతారంటూ ఇటీవల వచ్చిన మద్రాస్ హైకోర్టు తీర్పుతో.. సునీల్ కుమార్ పై లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన సునీల్ కుమార్ క్రిస్టియన్ మతంలోకి మారారని కాబట్టి ఆయన్ను పదవి నుంచి తొలగించాలని ఫిర్యాదులో కోరారు.  సునీల్ కుమార్ తాను క్రిస్టియన్ అని గతంలో చాలా సార్లు ఓపెన్ గానే చెప్పుకున్నారు. దీంతో ఆయన పదవికి గండం ఖాయమని అంటున్నారు.