వారసత్వపు రాజకీయం కాదు-వావి వరసలు లేని రాజకీయం

వంకాయ కడుపున వంకాయే పుడుతుంది కానీ..దొండకాయ పుడుతుందా.. ఛాన్సేలేదు. ఇదీ అంతే. ఎక్కడోచోట పొరపాటున వంకాయ చెట్టుకు బీరకాయ కాయొచ్చేమో కానీ.. 99.99 శాతం ఇలా జరగనే జరగదు. పాలిటిక్స్‌లో కూడా అంతే.. ఒక్కసారి రాజకీయాల్లోకి ఎంటరైతే ఇంత తాత ముత్తాతల దగ్గరి నుంచీ.. తండ్రీ కొడుకు, కూతురు, మనవళ్లు, మనవరాళ్ల వరకు ఆ వారసత్వం రాజకీయం అలా కొనసాగాల్సిందే.. గ్రేటర్‌ ఫైట్‌లోను అదే జరుగుతోంది.. ఎన్నేళ్లు కాదు. ఎన్ని దశాబ్ధాలు రాజకీయాల్లో ఉన్నా వీళ్లు అలసిపోరు.. ఎందుకంటే పెజాసేవంతో వీళ్లకు కసి.. మున్సిపల్‌ ఎన్నికల్లో నిజమైన, నిఖార్సైన ప్రజా నాయకులు ఎంతమందున్నారో వేళ్లమీద కూడా లెక్కపెట్టలేమేమో.. అంతలా వేళ్లూనుకుపోయింది వారసత్వ రాజకీయం.. ఉన్న పదవులు చాలవో.. లేక బ్యాంకుల్లో లాకర్లు ఎక్స్‌ట్రాగా ఏర్పాటు చేసుకున్నారో తెలియదు కానీ.. పెద్దల పిల్లలు మాత్రం చదువును అటకెక్కించి.. ప్రజలన్నా, ప్రజాసేవన్నా పడి చస్తున్నారని పబ్లిక్‌ కామెంట్.. మీరే చూడండి.. రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుమార్తె గద్వాల్‌ విజయలక్ష్మి బంజారాహిల్స్‌ నుంచి బరిలో దిగారు.. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస రెడ్డి రామ్‌నగర్‌ డివిజన్‌ నుంచి రంకెలేస్తున్నారు.

మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి ఆర్‌కెపురం డివిజన్‌ నుంచి సై అంటున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి రెడ్డి అల్వాల్‌ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దివంగత కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర సతీమణి లలిత గౌలీపుర నుంచి పోటీ చేస్తున్నారు.  కూకట్‌పల్లి శాసన సభ్యుడు మాధవరం కృష్ణారావు అత్త లక్ష్మీబాయి, ఆయన బావ జూపల్లి సత్యనారాయణతో పాటు, కృష్ణారావు బంధువు కూడా కూకట్‌పల్లి డివిజన్‌ నుంచి కేకలేస్తున్నారు. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత కూడా అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన పిజెఆర్‌ కూతురు విజయారెడ్డి.. ఇప్పుడు టిఆర్ఎస్‌ నుంచి ఖైరతాబాద్‌ డివిజన్‌ నుంచి గెలిచేస్తా అంటున్నారు. అంతేనా గతంలో జిహెచ్‌ఎంసిలో టిడిపి ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేసిన సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి భార్య ఇప్పుడు స్వర్ణలతా రెడ్డి ఇప్పుడు సైదాబాద్‌ నుంచి సై అంటే సై అంటున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఒకే దెబ్బకు ఐదారు పిట్టలు అన్నట్లు.. ఒకే ఇంట్లో, ఒకే కుటుంబంలో కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్‌..టిడిపి లనుంచి పోటీ చేస్తున్న వారూ లేకపోలేదు. వీరికి రాజకీయాలంటే ఎంతిష్టమో.. పెజా సేవంటే ఎంత ప్రాణమో.. ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరి వారసులను గెలిపించుకోవాలంటే, నేతలకు పాట్లు తప్పవు కదా.. మంచినీళ్ల దగ్గరి నుంచీ, మటన్‌ బిర్యానీ వరకు, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ నుంచీ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే వరకు, ఎన్ని తిప్పలు పడుతున్నారో.. పాపం.. కదా.. వీళ్లను చూస్తుంటే జాలేస్తోందని.. నగర జనమే కోడై కూస్తున్నారు. ఎన్నికలప్పుడు కన్నబిడ్డలకంటే ఎక్కువగా గుర్తుకొచ్చే ఓటర్లు..  ఎన్నికల తంతు ముగిశాక ఎవడ్రా నువ్వు అని అనకున్నా.. అంతకుమించి అవమానిస్తారు. అప్పుడే కదా వారసులు కూడా వారసత్వపు రాజకీయాలను పుణికిపుచ్చుకునేది. ఓట్ల కోసం ఎన్ని జాతరలు చేసినా.. ఎన్ని కోటలు దాటే మాటలు చెప్పినా..సామాన్యుడు మాత్రం మేల్కొనకపోతే.. ఈ ప్రస్థానం ఇలా కొనసాగుతూనే ఉంటుంది.

అందుకే ఓటు అనే ఆయుధాన్ని.. అంకుశంగా మలుచుకుని, సరైన లీడర్‌ను ఎన్నుకోకపోతే.. ఐదేళ్లవరకు ఇవే రోడ్లు, ఇవే గుంతలు, ఇవే ట్రాఫిక్‌ జామ్‌లు, ఇవే సమస్యలు.. మీతో చెలిమి చేస్తూనే ఉంటాయి. మీరు వద్దన్నా.. ఎన్నిసార్లు కటీఫ్‌ చెప్పినా.. అవి మాత్రం ఒక్కసారి కమిట్‌ అయ్యాక మా మాట మేమే వినము.. అనేలా మీతో అంటిపెట్టుకు తిరుగుతాయి.. ఇప్పుడు చెప్పండి.. సమస్యలతో సావాసం చేద్దామా.. పరిష్కారమార్గాలను వెతుకుదామా.. లీడర్లు మామూలే.. వస్తారు.. పోతారు.. కానీ సమస్యలు మాత్రం ఒక్కసారి వస్తే.. అవి రోజురోజుకూ గ్యాంగ్రిన్‌లా పెరుగుతూ పోతాయే కానీ.. కరిగిపోయేవి కాదు.. అందుకే ఆలోచించండి.. వారసత్వపు రాజకీయాలైనా, వావివరసలు లేని రాజకీయాలైనా సరే.. మీకు నచ్చినవారికి ఓటేయడం కన్నా.. పని చేయగలరు అన్నవారినే ఎన్నుకోండి.. అప్పుడే మన హైదరాబాద్‌.. మన భాగ్యనగరం మరింత అందంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.