రోహిత్ ఆత్మహత్య రచ్చ వెనుక అసలు నిజాలు ఏంటి..?

దేశంలో ఇప్పుడు అతిపెద్ద పండుగ జరుగుతోంది. ఆ పండుగలో పెద్ద పెద్ద మేధావులంతా పాల్గొంటున్నారు. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే  మేమంటే మేమని ..పోటిపడుతూ సానుభూతి కురిపించటానికి , కులాల పేర్లతో మరోసారి చిచ్చు పెట్టడానికి వాళ్ళకో .." కారణం "  దొరికింది. .. ఆ కారణమే రోహిత్‌..  బయటకు బస్తాలకొద్దీ డైలాగులు చెబుతున్న పొలిటికల్‌ పెద్దలు.. లోలోపల రోహిత్‌కు కోటాను కోట్ల థ్యాంక్స్‌ లు చెప్పుకుంటున్నారేమో కూడా .  ఎందుకంటే.. ప్రస్తుతం ఏ పనీ పాట లేని రాజకీయ పార్టీలకు రోహిత్‌.. ఎడారిలో గోదారిలా దొరికాడు.. ఇంకేముందీ.. బ్యాండ్‌ బజాయిస్తున్నాయి.

దళితుడు అన్న నాలుగు అక్షరాలతో రాజకీయ చదరంగం ఆడుతున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఎవరికి ఎలా చెక్‌ పెట్టాలోనని, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మీడియా కూడా తన వంతు పాత్ర పోషించకుండా.. గానాబజానాలో నేను సైతం అంటోంది.. ఏ లీడర్‌ ముందొచ్చి రోహిత్‌ చావును క్యాష్‌ చేసుకుంటాడోనని.. అన్ని పార్టీల లీడర్లు సెంట్రల్‌ యూనివర్సిటీకి క్యూ కట్టాయి. ఇంకా కడుతూనే ఉంటాయి. ఈ ఆరనిమంట చల్లారేదేప్పుడో  పొలిటికల్‌ పెద్దలకే తెలియాలి.. అసలీ కులాల గొడవ ఏంటి ?  .. ఇంత స్పీడు యుగంలో కూడా కులాల కురుక్షేత్రం అవసరమా..? ఎక్కడున్నాం మనం.. ? ఏమైపోతున్నాం..? ఏ దిశగా అడుగులు వేస్తున్నాం.. సభ్య సమాజానికి ఏం చెబుతున్నాం.. ? ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌..లాంటివి వచ్చి ప్రపంచం లో ని మనుషులని దగ్గర చేస్తుంటే  ఈ కులాలు  పక్కపక్కన వున్న వ్యక్తులని దూరం చేస్తున్నాయి. నిజానికి ఈ ప్రపంచం లో ఉన్నది రెండే కులాలు.. ఒకటి ఉన్నవాడు, .. రెండు లేనివాడు . ఈ రెండు కులాల మధ్యే అనాదిగా పరోక్ష  యుద్ధం జరుగుతోంది. .ఆ విషయాన్ని గ్రహించకుండా   దళిత  కులం.. అగ్రవర్ణం అనేవే స్పర్దకు  ప్రధాన కారణాలు గా ఇప్పటికి నిలుస్తున్నాయంటే  మన అడుగులు పురోగమనాని ? తిరోగామనానికా ?....

రోహిత్‌ చావుకు కారణాలు ఏవైనా కావొచ్చు. కానీ.. కేవలం దళితుడు అన్న పదమే.. ఇంత కదం తొక్కుతోందంటే.. ఆ పదానికి పట్టం కట్టడానికి దేశ రాజకీయ నాయకులంతా పోటి పడుతున్నారు అంటే ..ఇంత కంటే  రాజకీయ దారుణ మేముంటుంది ? . దేశ రాజధానిలో  జరిగిన నిర్భయ ఉదంతంపై కూడా ఈ స్థాయిలో రాజకీయ నాయకులు ముందుకు రాలేదు అని సోషల్ మీడియా లో ఘాటుగా విమర్శలు వినిపించటం చూస్తుంటే , ఈ పరిణామాల పట్ల , రాజకీయ నాయకుల ఈ అత్యుత్సాహం పట్ల సామా న్యులెంత విసిగి వున్నారో తెలుస్తోంది.

మొన్నటికి మొన్న పఠాన్‌కోట్‌లో ఎంతోమంది సైనికులు దేశంకోసం ప్రాణాలు వదిలారు. . వాళ్లకోసం ఒక్క కొవ్వొత్తి వెలిగించారా.. ? ఒక్క నిమిషం మౌనం పాటించారా.. ? కనీసం ఒక్కరన్నా స్మందిన్చారా ? . పోనీ చనిపోయిన వీరసైనికుల కుటుంబాలను రాహుల్‌కానీ, కేజ్రీవాల్‌ కానీ . పరామర్శించారా. ?  ఈ సానుభూతి అప్పడేమయ్యింది ?  అందులో రాజకీయంగా కలిగే లబ్ది ఏముందనుకున్నారో ఏమో.. పఠాన్‌కోట్‌ను అస్సలు పట్టించుకోలేదు. కానీ.. రోహిత్‌ విషయాన్ని మాత్రం తమకు అనుకూలంగా మల్చుకునేందుకు రాహుల్‌, కేజ్రీవాల్‌..ఇంకా ఎందఱో నాయకులు పరుగులు పెడుతూ వచ్చి వాలారు .. రోహిత్ చావుకు కుమిలి పోయారు పాపం. . క్రేజీ పాలిటిక్స్‌.!

దళితుల కోసం ఏమైనా చేస్తామని చెబుతున్న వాళ్లంతా.. రోహిత్‌ మరణానికి ముందే వచ్చి.. ఆ స్టూడెంట్స్ధ తరుపున నిలబడి వుంటే , వాళ్ళకి మానసిక దైర్యాన్ని ఇచ్చి వుంటే , వారుచేసిన దర్నాలు, ఆందోళనలు కు మద్దతు పలికి వుంటే ? ఓ నిండు ప్రాణం నిలిచేది . భావి భారత విజ్ఞాన ఖని ప్రయాణం కొనసాగి వుండేది ... ఇలా అర్దాంతరం గా ముగిసేది కాదు. మనిషి బతికుండగా  సహాయపడేది  రాజకీయం అనిపించుకోదు.. చచ్చిన తర్వాత చేయకపోతే అది రాజకీయమే కాదు..అనిపిస్తోంది వీరి వరస చూస్తుంటే . శవంపై రాజకీయం చేస్తున్నారో... రాజకీయం కోసం చావును వాడుకుంటున్నారో   లీడర్లకే తెలియాలి.

ఏది ఏమయినా ఈ మొత్తం వ్యవహారం లో అన్యాయం జరిగింది రోహిత్ కే. నిండు జీవితాన్ని పోగొట్టు కోవటమే కాదు , ఈ రోజున తన పుట్టుక నుంచి, తన తల్లి తండ్రి మూలల నుంచి, తన గత జీవితం , తన మాటలు, తన ఆశయాలు, అన్ని , అన్ని ఈ రోజు వీధి కెక్కి పదిమంది నోళ్ళల్లో , పది రకాలుగా నానుతున్నాయి. ఒక్కసారి" తను " కు మాత్రమే పరిమితమయిన " తను " ని రోహిత్ పోగుట్టుకున్నాడు. కేవలం స్వార్ధం తో అతని మరణానికి కులం రంగు పులమాలను కున్న  కొందరి వల్ల. చదువు లమ్మ వడిలో ఇంత కుటిల రాజకీయ క్రీడకి తెరతీసిన నాయకులను సోషల్ మీడియా లో , ఓ రకం గా ఉతికి ఆరేస్తున్నారు . ఎప్పుడెప్పుడు ఓదార్చడానికి ఓ మనిషి దొరుకుతాడా ! ఓ చావు కనబడుతుందా అని వెదికే నాయకుడు ఒకడైతే , ఖాళీగా , టైం పాస్ కాక ప్రత్యెక విమానాలలో వాలిపోయే వాడు ఒకడు, బోడుగుండుకి మోకాలికి ముడిపెట్టి మాట్లాడేవాడు మరొకడు ..ఇలా ఒకొక్కరు ఒకో రకం...కాని  వీళ్ళందరి లక్ష్యం ఒక్కటే .దీని నుంచి ఎవరెంత మైలేజి సంపాదించగలరో అన్న తాపత్రయం...అందుకే సమస్య పరిష్కారం కోసం కాక , దానికి బాధ్యులని వేలెత్తి చూబించ టానికే వీళ్ళ ప్రయత్నిస్తున్నారు.
 
సమస్య పూర్వాపరాలు , వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు . నోటికి వచ్చింది మాట్లాడి ఆవేశాలు రగులుస్తున్నారు..ఆ ఆవేశాలు విద్యార్దుల మనస్సుల పై చూబించే ప్రభావమెంతో , వాటి ఫలితమెంతో వారికి తెలియనిది కాదు. ఇదో వికృత క్రీడ ...ఆడేవారికి సరదా, అనుభవించే వాడికి బాధ...కాస్త పరిస్తితులు చల్లరగానే ..అందరు చల్లగా జారుకుంటారు ..మరో కారణాన్ని వెతుక్కుంటూ ...ఇందులో మోసపోయేది మనమే ...సామన్యులమే.