నల్లమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. టీఆర్ఎస్ నేత అరెస్ట్!

నల్లమల అడవుల్లో మరోసారి గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం దౌలాపూర్ లో బౌరాంబా దేవి ఆలయంలో దుండగులు విధ్వంసం సృష్టించారు. గుప్త నిధుల కోసం చెంచుల ఆరాధ్య దైవమైన భ్రమరాంబ విగ్రహాన్ని తొలగించారు. అయితే స్థానిక చెంచులు ఈ నిందితుల ముఠాను పట్టుకొని అటవీ శాఖాధికారులకు అప్పగించారు. ఈ ముఠాలో తిరుమలేశ్‌ నాయుడు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు హైదరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ ముఖ్యనేత అనుచరుడుగా తెలుస్తోంది. అసలు వాస్తవానికి అధికారుల కళ్లు గప్పి ఎవరూ ఇక్కడి అడవిలోకి అడుగు పెట్టే పరిస్థితి లేదు. కానీ రాత్రికి రాత్రే ఆలయాల్లో తవ్వకాలు జరిగి పోతున్నాయి. దీంతో ఈ తవ్వకాల వెనుక ఇంటి దొంగల పాత్ర కూడా ఉందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. 

గతంలో ఓసారి ఫారెస్టు అధికారులు కొందరు భ్రమరాంబిక దేవాలయంలో గుప్త నిధుల తవ్వకాలు జరిపారని చెంచు వాచర్స్ ఆరోపిస్తున్నారు. బయటపెడితే తమను ఉద్యోగాల నుంచి తీసేస్తామని కూడా బెదిరించారని వారంతా ఆవేదన  వ్యక్తంచేస్తున్నారు. అంతేకాకుండా అడవిని కాపాడేవారే అక్రమాలకు పాల్పడితే ఎలా అంటూ చెంచు వాచర్స్ ప్రశ్నిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం రాంపూర్ పెంట వద్ద అటవీ శాఖాధికారులు గుప్త నిధుల తవ్వకాలు జరుపుతూ ఉండగా స్థానికులు వారిని బంధించారు. కానీ పైఅధికారుల ఒత్తిడితో వారిని వదిలేశారు. అప్పటి ఆటో కూడా ఇప్పటికీ చెక్ పోస్టు లోనే ఉంది. తాజాగా పట్టుబడిన ముఠా వెనుక కూడా అధికారుల పాత్ర ఉందని అంటున్నారు స్థానికులు. అయితే నిందితులను ప్రశ్నించి వారి వెనుక ఎవరున్నారో తెలుసుకొని పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడిస్తున్నారు.