తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన  బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి  కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జిట్టా  యశోదా హాస్పిటల్ లో చికిత్సపొందుతూ  మరణించారు
జిట్టా బాలకృష్ణారెడ్డి భౌతికకాయాన్ని ఆయన స్వస్థలం భువనగిరికి కుటుంబసభ్యులు తరలించారు. ఈ సాయంత్రం  భువనగిరి శివారు మగ్గంపల్లిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. 

తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి  పాత్ర మరువలేనిది.  మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ మరణానంతరం  జిట్టా కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా భువనగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం యువ తెలంగాణ పార్టీ'ని స్థాపించారు.  ప్రత్యేక తెలంగాణ బిల్లుకు సహకరించిన బీజేపీలో యువతెలంగాణలో  విలీనం చేశారు. 
తెలంగాణలో రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని  కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ లో న్యాయం జరగదని భావించి జిట్టా కెసీఆర్ నాయకత్వంలోని టిఆర్ ఎస్ లో చేరారు.  గత ఎన్నికల్లో జిట్టాకు బీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ సీటు ఇస్తారని భంగపడ్డారు.  ఆ తర్వాతే జిట్టా ఆరోగ్య పరిస్థితి విషమించింది. జిట్టా తిరిగిరాని లోకాలకు చేరుకోవడం తెలంగాణవాదులను కలచివేసింది.