మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారానికి కేవలం ఐదే పనిదినాలు

మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో రెండు రోజుల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. మహారాష్ట్రలో పని చేస్తున్న ప్రభుత్వం సెమీ గవర్నమెంట్ ఉద్యోగులు అందరూ ఇక మీదట వారంలో కేవలం ఐదు పనిదినాలే ఉండబోతున్నాయి.

తాజాగా సీఎం ఉద్దవ్ థాక్రే అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని.. ఇక నుంచి వీరందరికీ వారంలో రెండు రోజుల పాటు సెలవులూ అమలు కానున్నాయని అన్నారు. అదే విధంగా ఓబీసీ, ఎస్సీబీసీ, వీజేఎన్టీ అన్నిటికీ ప్రత్యేక డిపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. అలాగే.. వెనకబడిన వర్గాల అన్నింటికీ కలిపి బహుజన్ కల్యాణ్ అనే పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాకుండా మహారాష్ట్ర లోని అన్ని కాలేజీల్లో జాతీయ గీతం ఆలాపనను తప్పని సరి చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆదేశాలు శివాజీ జయంతి రోజైన ఈ నెల 19 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ప్రతి రోజూ ఉదయం అన్ని కాలేజీలలో తరగతులు ప్రారంభించడానికి ముందు జాతీయ గీతం ఆలపించేలా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు అన్ని కాలేజీలకూ పంపనుంది ప్రభుత్వం. దీనిని అమలు చేసేందుకు ఇప్పటికే అన్ని కాలేజీలూ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం అందుతుంది. ఇప్పుడు ఈ ఆదేశాల ద్వారా మహారాష్ట్ర కాలేజీల్లో చదువుకుంటున్న 15 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులు తప్పకుండా జాతీయ గీతాలాపన ప్రతి రోజూ చేస్తారు. దీంతో జాతీయ గీతాలాపన తప్పని సరి చేస్తూ దేశంలోనే ఏకైక రాష్ట్రంగా మహారాష్ట్ర నిలవనుంది. విద్యార్ధుల్లో దేశ భక్తి జాతీయ భావాలను పెంపొందించేందుకు ఈ నిర్ణయం దోహద పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.