గుడ్ న్యూస్.. రాష్ట్రానికి ఎక్కువ కోవిడ్ టీకాలు
posted on Apr 27, 2021 3:45PM
దేశంలో కరోనా పంజా విసురుతోంది. కొన్ని రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మే1 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేలా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. 18 ఏండ్లు నిండిన వారందరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు కూడా నేరుగా టీకాలు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.
కేంద్రం తాజా ఆదేశాలతో వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వ్యాక్సిన్లు సరిపడా లభిస్తాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి గుడ్ న్యూస్ అందింది. హైదరాబాద్ కేంద్రంగా తయారవుతున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను రాష్ట్రానికి సరిపడా ఇస్తామని ఆ సంస్థ ఎండీ తెలిపారు.
భారత్ బయోటెక్ ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ భేటికి భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, ఇతర ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భారత బయోటెక్ ఎండీతో చర్చలు జరిపినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో ఉచిత వ్యాక్సిన్ ఇస్తుండడంతో అందుకు సరిపడా డోసులు సరఫరా చేయాలని భారత్ బయోటెక్ ప్రతినిధులను కోరినట్లు చెప్పారు. ఈ విషయంపై భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సానుకూలంగా స్పందించినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.