సంగంపై సర్కారు కక్ష.. ఏపీ డెయిరీలో విలీనం.. జగన్ మొండితనం!
posted on Apr 27, 2021 4:01PM
సంగం డెయిరీ ప్రభుత్వ పరమైంది. సీఎం జగన్ పంతం నెరవేరింది. అనుకున్నది మొండిగా సాధించుకున్నారు. అరెస్టులకు తెగించారు. తన తండ్రి వైఎస్ మొదలు పెట్టిన కుట్రను జగన్ పూర్తి చేశారు. టీడీపీని టార్గెట్ చేస్తూ.. ఆపరేషన్ సంగం డెయిరీ చేపట్టి.. ఇన్నేళ్లూ ప్రజల పక్షాన నిలిచిన సంస్థను.. ఇప్పుడు ప్రభుత్వ పరం చేశారు. ఆ మేరకు జీవో జారీ అయింది.
గుంటూరు జిల్లా వడ్లమూడి దగ్గర ఉన్న సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోని తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగం డెయిరీలో వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక సమర్పించింది. ఏసీబీ నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అంతకుముందు సంగం డెయిరీని గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసింది. బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కాసేపటికే ఉపసంహరించుకుంది. జీవో 515ను ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోని తీసుకొస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై సంగం డెయిరీ రోజువారీ కార్యకలాపాల బాధ్యతను తెనాలి సబ్‌కలెక్టర్‌కు అప్పగించింది. ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకునే అధికారాలను సబ్‌కలెక్టర్‌కు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది సర్కారు. దశాబ్దాల కుతంత్రం నేటికి సాకారమైంది.
టీడీపీ నేత, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌తోనే సంగం డెయిరీ ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరింది. తెల్లవారుజామున 100 మందికి పైగా పోలీసులు నరేంద్ర ఇంటిపై దాడి చేసి ఆయన్ను బలవంతంగా అరెస్ట్ చేశారు. 2013లో సంగం డెయిరీని మ్యాక్స్ చట్టం నుంచి కంపెనీ యాక్ట్‌లోకి మార్చే ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసులో భాగంగానే ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను, ఎండీ గోపాలకృష్ణన్‌ను అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు.
ధూళిపాళ్లను అరెస్ట్ చేసి తమకు అడ్డులేకుండా చేసుకున్న ప్రభుత్వం.. మూడు రోజుల వ్యవధిలోనే సంగం డెయిరీని ప్రభుత్వ పరం చేస్తూ ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదమవుతోంది. ఇందులోనూ వ్యవహారం సాఫీగా సాగలేదు. సర్కారుకే క్లారిటీ లేదు. ముందు సంగం డెయిరీని గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసింది. ఆ తర్వాత.. తూచ్ అంటూ ఆ ఉత్తర్వులు రద్దు చేసింది. ఆ తర్వాత మరో జీవో జారీ చేసి.. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోని సంగం డెయిరీని తీసుకొచ్చింది. అయితే, సంగం డెయిరీపై ప్రభుత్వ నిర్ణయమే అంతిమమేమీ కాకపోవచ్చు. ధూళిపాళ్ల నరేంద్ర ఇప్పటికే హైకోర్టులో దాఖలు చేసిన క్యాష్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. హైకోర్టు తీర్పే అంతిమం. అప్పటి వరకూ.. సంగం డెయిరీకి, పాడి రైతులకు ఆశలు మిగిలే ఉంటాయి.
సంగం డెయిరీ. గుంటూరు, ప్రకాశం పాడి రైతులకు పెన్నిధి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల కుటుంబాలకు ఆధారం. 2వేల కోట్ల వరకూ ఆస్తులు. దాదాపు 200 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు. సుమారు వెయ్యి కోట్ల టర్నోవర్. ఇలా, సంగం డెయిరీ ఆర్థిక వటవృక్షంగా ఎదిగింది.
సంస్థ ఆవిర్భావం నుంచి టీడీపీకి చెందిన వారే డెయిరీ చైర్మన్లుగా ఉన్నారు. ప్రస్తుతం డెయిరీకి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సంగంపై పైచేయి సాధించేందుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచే ప్రయత్నాలు జరిగాయి. అయినా, టీడీపీ పట్టు కోలేదు. వైఎస్ హయాంలో ఆర్డినెన్స్ ద్వారా పాలక వర్గాన్ని రద్దు చేసి.. డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి ఆదేశాలిచ్చారు. వీటిపై అప్పటి చైర్మన్ కిలారి రాజన్‌బాబు కోర్టులో స్టే తీసుకురావటంతో వైఎస్‌కు ఎదురుదెబ్బ తప్పలేదు.
జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. సంగం డెయిరీపై ప్రతీకార చర్యలు మరింత పెరిగాయంటారు. సంగం డెయిరీని దెబ్బ కొట్టేందుకే గుజరాత్‌కు చెందిన అమూల్ మిల్క్‌ను ఏపీకి తీసుకొచ్చారని చెబుతారు. అమూల్ తరఫున పాల సేకరణకు అధిక ధరలు చెల్లిస్తూ.. రైతులను అటువైపు మళ్లించే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. అయినా, సంగంతో దశాబ్దాల అనుబంధం ఉన్న పాడి రైతులు నేటికీ సంగం డెయిరీకే పాలు విక్రయిస్తున్నారు. దీంతో.. అమూల్‌కు పాలు అమ్మకపోతే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వమంటూ అధికారులు, పాలకులు బెదిరింపులకు దిగన సంఘటనలు ఇటీవల కాలంలో వివాదాస్పదమయ్యాయి.
రైతులు తమ దారికి రావడం లేదని భావించిన సర్కారు.. ధూళిపాళ్ల అరెస్ట్‌తో దూకుడు ప్రదర్శించింది. ముందు ధూళిపాళ్లను జైల్లో వేసి.. ఆ తర్వాత హడావుడిగా ఇప్పుడీ జీవో జారీ చేసింది. దశాబ్దాలుగా పాడి రైతుల పక్షాన నిలిచిన సంగం డెయిరీ.. ఇప్పుడిక ప్రభుత్వ డెయిరీ. రైతులతో రుణం తీరిపోతుందా? లేక, హైకోర్టు సంగం డెయిరీ పక్షాన నిలుస్తుందా? చూడాలి...