ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్.. సీఎంను నిలదీసిన షర్మిల
posted on Apr 27, 2021 4:10PM
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇందిరా పార్కులో రెండు రోజులగా సీతక్క దీక్ష చేస్తుండగా.. పోలీసులు వచ్చి ఆమెను అక్కడి నుంచి తరలించారు. సీతక్క దీక్షను భగ్నం చేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీతక్క అరెస్టుపై వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నిరాహార దీక్ష చేస్తున్న సీతక్కకు ఎలాంటి పరిష్కారం చూపకుండానే ప్రభుత్వం, పోలీసులు కలిసి ఆమె దీక్షను భగ్నం చేశారని ఆరోపించారు. దీన్ని తాము ఖండిస్తున్నామని షర్మిల ప్రకటన విడుదల చేశారు.
ప్రజల ప్రాణాలపై పాలకులకు పట్టింపు లేకపోయినా, ఒక మహిళగా సీతక్క ప్రజల తరఫున నిలిచి వారి ఆరోగ్యం కోసం దీక్ష చేశారని షర్మిల కొనియాడారు. సీతక్కను తాము అభినందించడమే కాకుండా, సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని షర్మిల వెల్లడించారు. ప్రశ్నించడమే నచ్చని పెద్దమనిషి కేసీఆర్ కు ఒక మహిళ పోరాటం చేస్తుంటే నచ్చుతుందా? అని ప్రశ్నించారు. ఆ అంశం జీర్ణించుకోలేకనే ప్రశ్నించే గొంతుకలను మట్టుబెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వ్యతిరేకిగా పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ కు రేపు ఆ మహిళల ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమాలే బుద్ధి చెబుతాయని షర్మిల హెచ్చరించారు.