తెలంగాణలో తెరుచుకోనున్న గురుకులాలు..

తెలంగాణలో గురుకులాలు తెరుచుకోనున్నాయి. కొవిడ్ కారణంగా మూతపడిన గురుకులాలు తెరిచేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురుకులాలు తెరవద్దన్న గత ఆదేశాలను హైకోర్టు సవరించింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా గురుకులాల ప్రారంభానికి అనుమతివ్వాలని ప్రభుత్వం కోరింది. విద్యాసంస్థల్లో కొవిడ్ నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఏజీ వెల్లడించారు. దీంతో గత తీర్పును సవరించిన హైకోర్టు.. గురుకులాల్లో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ బోధన చేపట్టాలని  ప్రభుత్వానికి సూచించింది.  

కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతితో మేలో లాక్ డౌన్ విధించారు. దీంతో జూన్ లో మొదలు కావాల్సిన విద్యా సంస్థలు తెరుచుకోలేదు. అయితే కోవిడ్ తీవ్రత తగ్గడంతో అక్టోబర్ నుంచి స్కూళ్లకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అన్ని రకాల విద్యా సంస్థలను తెరవాలని ఆదేశించింది. అయితే గురుకులలో కొవిడ్ మార్గదర్శకాలు పాటించడం సాధ్యం కాని, వాటిని తెరవొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై విచారించి ధర్మాసనం.. గురుకులాలు మినహా మిగితా విద్యాసంస్థలు తెరవొచ్చని ఆదేశించింది. తాజాగా గురుకులాలు కూడా తెరవడానికి గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది.