కేసీఆర్ నెక్స్ట్ టార్గెట్ హరీష్ రావేనా?

హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ లో అనూహ్య పరిణామాలు జరుగుతాయని కొన్ని రోజులుగా విపక్షాలు చెబుతున్నాయి. కేసీఆర్ పై తిరుగుబాటు జరగబోతుందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్ చేసి మరింత కాక రాజేశారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని, అందుకు హరీష్ రావును బాధ్యుడిని చేయబోతున్నారనే చర్చ కూడా సాగుతోంది. హరీష్ రావును టార్గెట్ చేశారు కాబట్టే.. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి కేటీఆర్ వెళ్లడం లేదని అంటున్నారు.

తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. టీఆర్‌ఎస్‌లో నెక్ట్స్ బలయ్యేది హరీష్ రావేనని అన్నారు.  హరీష్ రావును  కేసీఆర్ టార్గెట్ పెట్టారని చెప్పారు. హరీష్ రావు నువు మంచోడివి.. అబద్దాలు మాట్లాడకు అని సంజయ్ వ్యాఖ్యానించారు.  కేసీఆర్ కుటుంబంలో నాలుగైదు కమిటీలు ఉన్నాయన్నారు. అందులో ఒకటి లంచం ఎలా తీసుకోవాలో ప్లాన్ చేసే కమిటీ.. మరొకటి మీడియా ముందు అబద్దాలు మాట్లాడే కమిటి. కవిత, కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఏనాడైనా లాఠీ దెబ్బలు తిన్నారా? వేల కోట్లతో హుజురాబాద్‌లో గెలవాలని అనుకుంటున్నారని సంజయ్ మండిపడ్డారు.

దళితబంధు పథకం నిలిపివేతపై టీఆర్ఎస్ ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో ఈటల రాజేందర్ కు మద్దతుగా ఆయన ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ వాళ్లే ఎన్నికల సంఘానికి దళితబంధును ఆపించాలంటూ లేఖలు రాశారని, ఆ నెపాన్ని రివర్స్ లో బీజేపీ మీదకు నెడుతున్నారని ఆరోపించారు. తీరా ఎన్నికలు వచ్చినప్పుడే పథకాలను ప్రకటిస్తారని, చేతగాక ఈసీ పేరు చెప్పి నిలిపివేస్తారని టీఆర్ఎస్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధు నిధులను ఖాతాల్లో వేసినా.. విత్ డ్రా చేసుకోనివ్వలేదని ఆయన విమర్శించారు. ఖాతాల్లో వేసిన నిధులను ఫ్రీజ్ చేశారని మండిపడ్డారు. దళితబంధు నిధులు ఇవ్వాలని ముందు నుంచీ బీజేపీ డిమాండ్ చేస్తోందని అన్నారు.