టీడీపీ నేత పట్టాభి అరెస్ట్? విజయవాడలో హై టెన్షన్..

టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడి ఘటనలతో ఏపీలో రేగిన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. టీడీపీ బంద్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడలో హై టెన్షన్ నెలకొంది. తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. విజయవాడలోని పట్టాభి ఇంటి దగ్గరకు భారీగా పోలీసులు చేరుకుంటున్నారు. సీఎం జగన్‌ను పట్టాభి దూషించారంటూ కేసులు నమోదు చేసి ఉంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

పట్టాభి ఇంటిపై వైసీపీ శ్రేణులు మంగళవారం దాడికి తెగబడ్డాయి. పట్టాభిని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. ఆ సమయంలో పట్టాభి, ఆయన భార్య చందన ఇంట్లో లేరు. ఇంట్లో పట్టాభి కుమార్తె అన్నపూర్ణ, పనిమనిషి గోవిందమ్మ ఉన్నారు. డ్రైవర్‌ శివారెడ్డి బయట కూర్చుని ఉన్నాడు. మొదట ముగ్గురు, నలుగురు యువకులు వెళ్లి పట్టాభి ఉన్నాడా అంటూ  డ్రైవర్‌ను అడిగారు. లేరని చెప్పడంతో అంతా దాడికి పాల్పడ్డారు. 

వందమంది ఒక్కసారిగా లోపలకు రావడంతో పనిమనిషి గోవిందమ్మ భయంతో చిన్నారి అన్నపూర్ణను తీసుకుని బాత్‌రూంలోకి దాక్కుంది. దుండగులు ఇల్లు మొత్తాన్ని చెల్లాచెదురు చేశారు. మహిళలు తొడగొట్టుకుంటూ పట్టాభిపై బూతుపురాణం విప్పారు. 4.10- 4.15 గంటల మధ్య విధ్వంసం జరిగిందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. కొడవళ్లతో పట్టాభి పీక కోస్తామంటూ మహిళలు నినాదాలు చేశారు. ఈ ఘటన తర్వాత మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.