జనసేనానికి నేచురల్ స్టార్ నాని మద్దతు

నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే నటుడు, రచయత అయిన పోసాని కృష్ణ మురళి వైసీపీ తరఫున మీడియా సమావేశాలలో మాట్లాడుతున్నారు. వైసీపీలోనే ఉన్న కమేడియన్ అలీ మాత్రం అసలు ప్రచారం వైపు చూసిన దాఖలాలు లేవు. ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగా హీరోలతో పాటు బుల్లి తెర నటులు ఆది, సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ వంటి వారు ప్రచారం చేస్తున్నారు. అంతకు మించి సినీ పరిశ్రమ  నుంచి పెద్దగా ఎవరూ బయటకు వచ్చినట్లు కనిపించదు. అయితే ఎన్నికలు రోజుల వ్యవధిలోకి వచ్చిన తరుణంలో ఒక్కరొక్కరుగా సినీ ప్రముఖులు బయటకు వచ్చి తమ మొగ్గు ఎవరివైపో చెబుతున్నారు.

ఇప్పటికే చిరంజీవి తన సోదరుడికి ఓటేయాలంటూ పిఠాపురం ప్రజలకు వీడియో ద్వారా పిలుపునిచ్చారు. అలాగే అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కు ఓటేయాలంటూ కోరారు. తాజాగా  పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతుగా నేజురల్ స్టార్  నాని  రంగంలోకి దిగాడు. సోషల్ మీడియా వేదికగా జనసేనానికి మద్దతు ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఎదుర్కోబోయే పెద్ద రాజకీయ యుద్ధంలో విజయం సాధించాలని కోరుతూ ట్వీట్ చేశారు. మీరు కోరుకున్నది సాధించి, మీ వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు. సినిమా కుటుంబ  సభ్యుడిగా పవన్ కల్యాణ్ కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ ట్వీట్ లో నాని పేర్కొన్నారు.  

గతంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలను బాగా తగ్గించిన జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా నాని  తన స్వరం వినిపించాడు. రాజకీయాల్లో లేనప్పటికీ ధైర్యంగా టికెట్ ధరల అంశంపై స్పందించిన నానికి.. అప్పట్లో పవన్ అండగా నిలిచాడు. ఇప్పుడు ఎన్నికల వేళ జనసేనాని కి నాని మద్దతు పలకడం పట్ల  పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.