అప్పుడు జగన్.. ఇప్పుడు టీ సర్కార్
posted on Jul 9, 2015 3:09PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టు పై జగన్ ఆరోపించడం అయిపోయింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆరోపించడం మొదలుపెట్టింది. గతంలోనే జగన్ పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించడమే కాకుండా దాన్ని అడ్డుకోవడానకి చాలా ప్రయత్నించారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకత చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. "పట్టిసీమ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టమని, ఈ ప్రాజెక్టు పైన ముందుకు వెళ్లకుండా ఆదేశించాలని, వాటాలు తేలకుండా ప్రాజెక్టు ఎలా చేపడతారని, గోదావరి మిగులు జలాలను ఉపయోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ కు ఎంత ఉందో తెలంగాణ రాష్ట్రానికి కూడా అంతే ఉందని కేంద్రం, గోదావరి బోర్డుకు లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఎత్తిపోతల పథకం అక్రమమని.. విభజన చట్టానికి ఇది పూర్తి వ్యతిరేకమని లేఖలో పేర్కొన్నారు. అసలు గోదావరి నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా దానికి గోదావరి నది యాజమాన్యం అనుమతి తీసుకోవాలని.. అంతేకాక ఇద్దరు ముఖ్యమంత్రులతో కూడిన అపెక్స్, కేంద్ర జలసంఘం అనుమతి కూడా తీసుకోవాలని.. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించాలని చూస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది.
తాగునీటి అవసరాలకు సీఎం చంద్రబాబు ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్నిచేపట్టారు. 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించే పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. అప్పుడు జగన్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంత వాసులకు నీటి కొరత లేకుండా చేయలని చూస్తున్న చంద్రబాబుకు కోరికను ఎలాగైనా నెరవేరకుండా చేయాలని చూస్తున్నారు అటు ప్రతిపక్షనేత అయిన జగన్.. ఇటు తెలంగాణ ప్రభుత్వం.