మళ్ళీ మరో పిటిషను పడింది

 

తెలంగాణా ప్రభుత్వం ఈ 10 నెలల కాలంలో అనేక మార్లు కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది. ఇంతకు మునుపు సమైక్య రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు కూడా అడపా దడపా కోర్టు మెట్లు ఎక్కిన సందర్భాలున్నాయి. కానీ తెరాస ప్రభుత్వంలాగ నెలకీ వారానికీ ఓ మారు కోర్టు మెట్లు ఎక్కిన దాఖలాలు మాత్రం లేవు. ఎర్రగడ్డకి సచివాలయ తరలింపు, అక్కడ ఉన్న పురాతన భవనం కూల్చివేత, ఆంధ్రా వాహనాలపై ప్రవేశపన్ను, తరువాత హైకోర్టు విభజన, ఆ తరువాత పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం...ఇలా ఒకదాని తరువాత మరొక కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. పాత కేసులు పరిష్కారం కాక మునుపే మళ్ళీ మరొక కొత్త కేసు దాఖలవుతుండటంతో తెలంగాణా ప్రభుత్వం నిత్యం కోర్టు మెట్లు ఎక్కక తప్పడం లేదు.

 

తాజాగా మరొక కేసు దాఖలయింది. ఈసారి ఇందిరా పార్క్ వాకర్స్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేసారు. పిల్లలూ, సామాన్య ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకొనే యన్టీఆర్ స్టేడియంలో కళాభారతి పేరుతో సిమెంట్ కట్టడాలు నిర్మించాలనే జి.హెచ్.యం.సి. నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుధాకర్ హైకోర్టులో ఒక ప్రజాహిత వాజ్యం వేశారు. నగరంలో కళా ప్రదర్శనలకు రవీంద్ర భారతి, శిల్పారామం వంటివి ఉండగా వాటిని కాదని పిల్లాలు ఆడుకొనే పార్కులో సిమెంట్ కట్టడాలు కట్టాలనే నిర్ణయాన్ని ఆయన తీవ్రం వ్యతిరేకిస్తున్నారు. పైగా జి.హెచ్.యం.సి. ప్రత్యేక పాలనాధికారి క్రింద నడుస్తున్న ఈ సమయంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని కూడా సుధాకర్ తన పిటిషనులో తప్పు పట్టారు. కోర్టు ఆయన వేసిన పిటిషనును విచారణకి స్వీకరించింది. కనుక త్వరలోనే దీని కోసం ప్రభుత్వం మరోమారు కోర్టు మెట్లు ఎక్కక తప్పేలా లేదు.