ఏపీ సీఎంకు తెలంగాణ ముఖ్యమంత్రి కృతజ్ణతలు.. ఎందుకో తెలుసా?
posted on Dec 31, 2024 9:36AM
తిరుమల దేవుని దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఇక నుంచి టీటీడీ అనుమతించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించేలా చూడాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖపై స్పందించిన చంద్రబాబు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడితో చర్చించి, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించారు.
అదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా తెలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో కలిసి చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియ జేశారు.తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో అంటే సోమవారం నుంచి గురువారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనం రూ.500/- టికెట్ కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ రూ. 300/- టికెట్ కొరకు రెండు లేఖలు స్వీకరించనున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక్కో లేఖపై గరిష్టంగా ఆరుగురు భక్తులను దర్శనానికి సిఫార్సు చేయొచ్చని తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలకు టీటీడీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు, టీటీడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అని పేర్కొంది.