కమలాన్ని ఖతం చేస్తా.. రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ!

కాంగ్రెస్ అధిష్ఠానం మనసు గెలిచేశారా?

కాంగ్రెస్ పార్టీ యుద్ధానికి సిద్దమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత గడ్డ గుజరాత్ నుంచి శంఖారావం పూరించింది. అహ్మదాబాద్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రెండు రోజుల విస్తృత స్థాయి సమావేశంలో న్యాయ్ ఫథ్ పేరిట ఆమోదించిన తీర్మానం  పై జరిగిన చర్చలో  మోదీని ఓడించడమే లక్ష్యం అన్నట్లుగా నేతల ప్రసంగాలు సాగాయి. 

ఎఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా దేశం నలుమూలల నుంచి వచ్చిన 1200 మంది  కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు బీజేపీ విధానాలు, మోదీ ప్రభుత్వ  వైఫల్యాలను ఎండగడుతూ ప్రసంగించారు. ప్రధానంగా బీజేపీని ఓడించడం, మోదీని గద్దె దించడం లక్ష్యంగానే చిన్న,పెద్ద నేతలంతా ప్రసంగించారు. ఏఐసీసీ అధ్యక్షుడు, మల్లిఖార్జున ఖర్గే సహా ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ పునర్జీవనం పొందుతుందనే విశ్వాసం వ్యక్త పరిచారు. అలాగే  ఈసారి ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీని ఓడిస్తామని లోక్ సభ సాక్షిగా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రతిజ్ఞను నేతలు పునరుద్ఘాటించారు. ముఖ్య నేతలు, రాహుల్ గొంతుతో గొంతుతో కలిపి  గుజరాత్ నుంచి జైత్ర యాత్ర మొదలవుతుందన్న విశ్వాసం వ్యక్తపరిచారు. 

నిజానికి ఖర్గే మొదలు కీలక నేతలు చేసిన ప్రసంగాలలో కొత్తదనం పెద్దగా కనిపించ లేదు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి మాత్రం  కొంత భిన్నంగా, కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగతున్న రాజకీయ పోరాటానికి సైద్ధాంతిక వారసత్వాలను జోడింఛి ఉద్రేక పూర్వక  ప్రసంగం చేశారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగతున్న రాజకీయ పోరాటాన్ని, గాంధీ వారసులకు, గాడ్సే వారసులకు జరుగతున్న పోరాటంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.అయితే  రేవంత్ రెడ్డి బీజేపీ సంఘ్ పరివార్  పై చేసిన ఘాటు విమర్శలలో మరో రాజకీయ కోణం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. 

బహుశా,పూర్వాశ్రయంలో ఆయనకున్న కాషాయ బంధాలకు సంబంధించి వినవస్తున్న ఆరోప ణలు,అనుమానాల నివృత్తి కోసం  రేవంత్ రెడ్డి  ఎఐసీసీ వేదిక నుంచి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని  పరిశీలకులు పేర్కొంటున్నారు. అందుకే,  బీజేపీ,ఆర్ఎస్ఎస్  ఐడియాలజీని అంతం చేయ డమే తమ లక్ష్యమని, మరో అడుగు ముందుకేసి  దేశాన్ని దుర్మార్గంగా పాలించిన ఆంగ్లేయుల కంటే గాంధీని చంపిన గాడ్సే వారసులైన బీజేపీ నాయకులతోనే ఈ దేశానికి మరింత ప్రమాదం పొంచి ఉందని  ఘాటైన విమర్శలు చేశారని అంటున్నారు. అలాగే   అహ్మదాబాద్ స్పూర్తితో  తెలంగాణలో బీజేపీని  కాలు పెట్టనీయనని, ఖతం చేస్తామని శపధం చేయడం  కూడా శీల పరీక్షలో భాగంగానే పేర్కొంటున్నారు.

అలాగే  రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట ప్రకారం  తెలంగాణలో  రైతు రుణ మాఫీ చేశామనీ, రూ.2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీచేసి, లక్షలాది రైతులను రుణ విముక్తులను చేశామని చెప్పారు. అలాగే  కుల గణన ప్రస్తావన చేశారు. ఇందుకు అనుగుణంగా  రిజర్వేషన్ల పెంపును అనుమతించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం, ఢిల్లీ జంతర్ మంతర్  వద్ద ధర్నా చేశామని చెప్పారు.

 నిజానికి, ఇతరుల ప్రసంగాలతో పోలిస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగం, కొంత భిన్నంగా ఉండడమే కాకుండా, లక్ష్య నిర్దేశంతో, టార్గెటెడ్ గా సాగిందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే, ఆయన లక్ష్యం కూడా కొంత నెరవేరినట్లేనని అంటున్నారు. గత కాలంగా   రేవంత్ రెడ్డి బీజేపీకి దగ్గరవుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో, మరీ ముఖ్యంగా  కారాణాలు ఏవైనా, కారణం ఎవరైనా, రాహుల్ గాంధీలోనూ అలాంటి అనుమాన బీజాలు నాటుకున్నాయని, అలాంటి అనుమానాలే ఉన్నాయనే సంకేతాలు వస్తున్న నేపధ్యంలో  రేవంత్ రెడ్డి ఏఐసీసీ వేదికను ఉపయోగించుకున్నారని అంటున్నారు. అలాగే  రాహుల్ గాంధీ సమక్షంలో  బీజేపీ, ఆర్ఎస్ఎస్  ఐడియాలజీని వ్యతిరేకించడంలో  తాను ఎవరికీ తీసిపోనని నిరూపించుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తునారు.

అంతే కాకుండా ఈ ప్రయత్నంలో ఆయన కొంత వరకు సక్సెస్  అయ్యారని కూడా పరిశీలకు భావిస్తున్నారు. కాగా రాహుల్ గాంధీ తమ ప్రసంగంలో కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో రేవంత్ రెడ్డి చూపుతున్న చొరవను మెచ్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం  కుల గణన విజయవంతంగా చేయడంతో పాటుగా  కులగణన ఆధారంగా బీసీల  రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరుతూ, అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని రాహుల్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.అంతేకాకుండా, అంతటితో ఆగకుండా  ఢిల్లీలో పోరాటం చేస్తున్నారని, రేవంత్ రెడ్డి ప్రయత్నాలను  ప్రశంసించారు. సో,  ఆమేరకు రేవంత్ రెడ్డి ప్రసంగం ఫలితం ఇచ్చిందనే అనుకోవచ్చును, అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu