ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది సత్యమే ..కానీ

తెలంగాణాలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల గురించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది, ముమ్మాటికీ నిజం. శాసన సభ వేదికగా ఆయన చేసిన ప్రసంగం మాటల్లోంచి, ఒక్క అక్షరాన్ని కూడా తప్పు పట్ట లేము. తీసి వేయలేము.  సరే..కోర్టు విచారణలో ఉన్న పార్టీ ఫిరాయింపుల  అంశాన్ని సభలో ప్రస్తావించ వచ్చునా? లేదా? అలా ప్రస్తావించడం కోర్టు ధిక్కరణ అవుతుందా? కాదా? అన్నది, వేరే విషయం. మళ్ళీ అది కోర్టు పరిధిలోని విషయం. ఎలాగూ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఆల్రెడీ ప్రకటించారు, కాబట్టి  ఆ విషయాన్ని  కోర్టు చూసుకుంటుంది. 
ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇక ముఖ్యమంత్రి ప్రసంగం విషయానికి వస్తే  బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి  కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు రావని  కుండ బద్దలు కొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  గతంలో ఏమి జరిగిందో ఇప్పడు కూడా అదే జరుగుతుందన్న విశ్వాసంతో ఉప ఎన్నికలు ఎందుకురావో కూడా వివరించారు.  అవును  గత టీబీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలోనూ ఫిరాయింపులు జరిగాయి. అప్పుడున్న చట్టమే ఇప్పుడూ ఉంది. అప్పుడున్న స్పీకర్ వ్యవస్థే ఇప్పడూ ఉంది.  సో.. అప్పుడు పార్టీ ఫిరాయించిన ఏ ఒక్కరి పైనా అనర్హత వేటు పడలేదు. ఏ ఒక్కరూ రాజీనామ చేయలేదు. ఏ ఒక్క నియోజక వర్గంలోనూ ఉప ఎన్నిక రాలేదు. సో.. ఇప్పుడు కూడా ఏ ఒక్కరిపైనా అనర్హత వేటు పడదు. ఏ  ఒక్కరూ రాజీనామా చేయవలసిన అవసరం రాదు. ఏ ఒక్క నియోజక వర్గంలోనూ ఉప ఎన్నిక రాదు. అని ఎవరైనా అనుకోవచ్చును. ముఖ్యమంత్రి చెప్పిందీ, అదే. అందులో అభ్యంతరం చెప్పవలసింది ఏమీ లేదు. ఒక విధంగా ముఖ్యమంత్రి, ఎలాంటి శషబిషలు లేకుండా చేసిన ప్రకటన గుమ్మడి కాయ దొంగలు బుజాలు తడుముకునేలా చేసింది. అయితే  ముఖ్యమంత్రి సభలో అలాంటి ప్రకటన చేయవచ్చునా? అది  ఫిరాయింపులను ప్రోత్సహించడం అవుతుందా కాదా? అనేది వేరే విషయం.    
నిజానికి  గత బీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలో జరిగిన ఫిరాయింపులతో పోలిస్తే  ప్రస్తుత కాంగ్రెస్   హయాంలో జరుగుతున్న ఫిరాయింపుల  పెద్ద విషయం కాదు.  2014 నుంచి 2023 వరకు వరసగా రెండు సార్లు అధికారంలోకివచ్చిన టీఆర్ఎస్/బీఆర్ఎస్ మొత్తం మీద ఓ 50 మందికి పైగానే  ఇతర  పార్టీల  ఎమ్మెల్యేలను కారు ఎక్కించి, గులాబీ కండువా కప్పించిది.  అంతే కాదు,  అందులో చాలా మందిని మంత్రులను చేసింది.  

నిజానికి  బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం, స్వాగతించడం మాత్రమే కాదు, ఏకంగా  శాసన సభా పక్షాలను స్వాహా   చేసింది. టీఆర్ఎస్/బీఆర్ఎస్  శాసన సభా పక్షంలో వినీనం చేసుకుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు..  తెలుగు దేశం, సిపిఐ పార్టీల శాసన సభా పక్షాలను టీ(బీ)ఆర్ఎస్  స్వాహ చేసింది.  తెలంగాణ తొలి ముఖ్యమంతి కేసీఆర్   ఇతర పార్టీల ఎమ్మెల్యేల సర్పయాగంతోనే  తెలంగాణ స్వీయ పాలనకు శ్రీకారం చుట్టారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా పార్టీలనూ వదలకుండా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను  సగౌరవంగా స్వాగతించి  స్వాహా  చేశారు. ఒక్క బీజేపీ  సిపిఎం ఎమ్మెల్యేలు మాత్రమే కేసీఆర్   స్వాహా యాగం నుంచి తప్పించుకున్నారు. అవును  కేసీఆర్  ఎంఐఎం ఎమ్మెల్యేల జోలికి కూడా పోలేదు. కానీఎంఐఎంను మిత్ర పక్షం చేసుకున్నారు. 

నిజానికి, 2014 లో టీఆర్ఎస్ గెలిచింది 63 సీట్లు మాత్రమే.  అత్తెసరు మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్  రాజకీయ పునరేకీకరణ పేరిట కాంగ్రెస్ ,టీడీపీ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలను కారెక్కించారు. అలాగే  ఇతర పార్టీల ఎమ్మెల్యేను తమ వైపుకు తిప్పుకుని అసెంబ్లీలో సంఖ్యా బలాన్ని గణనీయంగా పెంచుకున్నారు.  అలాగే, 2018లో సొంత సంఖ్యా బలం 88కి పెరిగినా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మందిలో 14(13 ప్లస్ 1) మందిని  లాగేసుకుని  కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా  కూడా లేకుండా చేశారు. అలాగే  టీడీపీ సహా ఇతర పార్టీలకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు` గులాబీ కడువలు కలిపి, అసెంబ్లీలో బీఆర్ఎస్ సంఖ్యా బలాన్ని సెంచరీ దాటించారు. అందుకే ఇప్పడు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తోందని ఆరోపించడం  వెయ్యి బర్రెలను తిన్న ... సామెత గుర్తుకు తెస్తున్నదని అంటున్నారు. 

అయితే  రాజకీయ విశ్లేశకులు మాత్రం  గతంలో ఏమీ జరగలేదు కాబట్టి  ఇప్పడు కూడా ఏమీ జరగదు అనుకుంటే అది పొరపాటే అవుతుందంటున్నారు. అలాగే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  ను ఆదర్శంగా తెసుకుని అదే మార్గంలో నడిస్తే ఏమవుతుందో కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి చెప్పారు. సో ..మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు.