ఏఐజీ ఆస్పత్రి నుంచి కొడాలి నాని డిశ్చార్జ్
posted on Mar 31, 2025 12:28PM

మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని మెరుగైన వైద్య చికిత్స కోసం ముంబైకి తరలించాలని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈనెల 26న తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన కొడాలి నాని సోమవారం (మార్చి 31)న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఆ హెల్త్ బులిటిన్ మేరకు కొడాలి నానికి హార్ట్ లో మూడు బ్లాక్స్ ఉన్నాయి. ఆయనకు స్టంట్ అమర్చడం కానీ ఆపరేషన్ కానీ చేయాల్సి ఉంది.
అయితే కొడాలి నాని కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కు తీసుకువెళ్లాలని నిర్ణయించుకోవడంతో వారి అభ్యర్థన మేరకు కొడాలి నానికి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. కొడాలి నానికి హార్ట్ లో మూడు బ్లాక్ లు పూర్తిగా మూసుకుపోవడంతో ఆయనకు బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని భావిస్తున్నారు. కొంత కాలం చికిత్స అందించి, ఆ తరువాత అవసరం మేరకు ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కు తరలించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు కొడాలి నాని విశ్రాంతి తీసుకోనున్నారు.