హైదరాబాద్ దాటించడానికే "తలసాని" శాఖ మార్పు..
posted on Apr 26, 2016 4:47PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ ఊహించినట్టుగానే తన కేబినెట్‌లో శాఖలు మార్చారు. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలకు తెర దించుతూ..కేవలం నాలుగు శాఖల మార్పునకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం వద్ద ఉన్న శాఖలతో పాటు మంత్రులు కె.తారకరామారావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాసయాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లో మార్పులు చేశారు. ఇందులో భాగంగా కొత్తగా మిషన్ భగీరథకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి సారథ్యం వహించనున్నారు. శాఖల మార్పులో మంత్రి తలసానికి షాక్ ఇచ్చారు సీఎం.
ఆయన ఇన్నాళ్లు పర్యవేక్షించిన వాణిజ్య పన్నుల శాఖను తొలగించి తనవద్దే ఉంచుకున్నారు. దానికి బదులుగా పశుసంవర్థక, మత్స్య శాఖలను ఇచ్చారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడంతో పాటు పన్ను వసూళ్లలో లొసుగులకు అడ్డుకట్ట వేయడం, పాత బకాయిలను రాబట్టడంలో మరింత మెరుగైన విధానాలను అనుసరించాల్సిన అవసరముందని అందుకే ఆ శాఖను తన వద్దే ఉంచుకుంటున్నట్టు సీఎం చెప్పారు. అయితే ఇలాంటి కీలకశాఖ నుంచి తలసానిని తప్పించి అంతగా ప్రాధాన్యం లేని పశు సంవర్థక శాఖ కేటాయించడానికి బలమైన కారణాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
తలసాని శాఖ మారబోతోందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. చివరకు పశుసంవర్థక శాఖకు పరిమితం చేయడం చర్చనీయాంశంగా మారింది. అత్యంత కీలకమైన శాఖను ఇచ్చినా తలసాని దానిని సరిగా నిర్వర్తించలేదని సీఎం చేయించిన సర్వేలో తేలింది. దానికి తోడు తలసానితో పాటు ఆయన గారి పుత్రరత్నం వ్యాపారులు, అధికారులను వేధింపులకు గురిచేసినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ మధ్య ఏకంగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్తను నిర్బంధించి దందాలకు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో తలసాని తన కుమారుణ్ణి వెనుకేసుకు రావడం జరిగింది. పైగా డిపార్ట్‌మెంట్‌పై ఆయనకు పట్టులేదని, సహచర మంత్రులంతా జిల్లా పర్యటనలకు వెళ్లి అధికారులతో సమీక్షలు జరపడం, సమస్యల పరిష్కారం లాంటివి లేకుండా ఎప్పడూ హైదరాబాద్‌ను పట్టుకుని వేలాడుతున్నారు తలసాని వీటన్నింటిని ఒక కంట కనిపెడుతూనే ఉన్న ముఖ్యమంత్రి సరైన టైం కోసం వెయిట్‌చేసి తలసానికి షాకిచ్చారు.
అటు ఆయన శాఖ మార్పుపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తలసాని శాఖను మార్చి ముఖ్యమంత్రి మంచి పని చేశారని, అందుకు వ్యాపారులు, అధికారుల తరపున కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరి తలసాని, సీఎం నిర్ణయం పట్ల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.