ఆంధ్రా కరెంట్ మాకు అక్కరలేదు: కేసీఆర్
posted on Mar 11, 2015 9:49AM
.jpg)
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటునప్పుడు విద్యుత్ ఇచ్చేందుకు నిరాకరించిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు విద్యుత్ ఇస్తామన్నా తీసుకొనేందుకు సిద్దంగా లేమని, తమకు ఆయనిచ్చే విద్యుత్ అవసరం లేదని కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పారు.
“ఆయన విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల మన ఏర్పాట్లు మనం చేసుకోవాలనే సంగతి అర్ధమయింది. అందుకే రూ.1500కోట్లు ఖర్చు చేసి ఓపెన్ మార్కెట్ నుండి 1300 మెగావాట్స్ విద్యుత్ కొనుకొన్నాము. ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకుండా కాపాడుకోగలిగాము. ప్రస్తుతం మనకి థర్మల్ మరియు హైడల్ విద్యుత్ కలిపి మొత్తం 6420 మెగావాట్ల విద్యుత్ ఉంది. వచ్చే రెండు నెలలలో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంటుంది. దానిని నివారించేందుకు అధనంగా ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేస్తాము. కానీ వచ్చే ఏడాదినాటికి రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. అప్పుడు వ్యవసాయానికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తాము. పరిశ్రమలకు అసలు విద్యుత్ కోతలుండవు. 2018 నాటికి రాష్ట్రంలో 24,575 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మన రాష్ట్రానికి కూడా మిగులు విద్యుత్ ఉంటుంది,” అని తెలిపారు.