ముందు భోజనానికి వెళదాం పదండి.. జానాతో కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో రైతు ఆత్మహత్యలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలపై అధికార పార్టీకి కొన్ని సూచనలు.. సలహాలు ఇవ్వాల్సి ఉందని.. అయితే దీనికి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది.. ఇప్పుడు కొంచెం.. భోజనం తరువాత కొన్ని చెపుతానని అన్నారు. దానికి కేసీఆర్ దానిని అవును భోజనం చేస్తేనే బాగా మాట్లాడుకుంటాం.. బాగా చర్చించుకుంటాం అని అన్నారు. దీనికి వెంటనే జానారెడ్డి భోజనం తర్వాత మీరు సభలో ఉంటారా అని ప్రశ్నించగా దానికి కేసీఆర్ తప్పకుండా ఉంటాను ముందు భోజనానికి వెళదాం పదండి అని అందరిని నవ్వించారు. సాధారణంగా అసెంబ్లీలో ప్రతిపక్షాలు అధికార పక్షాలు కలిసి ఒకరి మీద ఒకరు మాటల యుద్ధాలు చేసుకుంటారు.. కలిసి చర్చించుకోవడం.. సలహాలు సూచనలు తీసుకోవడం అరుదు.. ఈ రోజుల్లో అది చాలా కష్టం. కాని జానారెడ్డి.. కేసీఆర్ సంయమనం చూస్తే ఎప్పుడూ ఇదే తీరు అవలంబిస్తే.. ఒకరికి ఒకరు మర్యాద ఇచ్చుకుంటూ చర్చించుకుంటే ప్రజలు సమస్యలు తీరడం పెద్ద కష్టమేమి కాదనిపిస్తుంది.