దేశంలో తెలంగాణా ఏ-1 ఆర్ధిక శక్తి: ఇక్రా

 

మీడియా లేదా వివిధ సంస్థలు వెల్లడించే విషయాలు తమకు అనుకూలంగా ఉంటే వాటి గురించి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చాలా గొప్పగా చెప్పుకొంటాయి. కానీ అదే వ్యతిరేకంగా వచ్చే వార్తలను, విమర్శలను అర్ధరహితమయినవని కొట్టిపడేస్తుంటాయి. మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి గుజరాత్ తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత అనుకూలమయినదని, ఈ విషయంలో తెలంగాణా రాష్ట్రం 13వ స్థానంలో ఉందని కొన్ని వారాల క్రితం ప్రపంచ బ్యాంక్ పేర్కొన్నప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం దానిని హైలైట్ చేసి గొప్పలు చెప్పుకోగా, తెలంగాణా ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది. చంద్రబాబు నాయుడు, మోడీ ఇరువురు ప్రపంచ బ్యాంక్ పై ఒత్తిడి తెచ్చి బీజేపీ పాలిత రాష్ట్రాలకు, ఆంద్రప్రదేశ్ కు మంచి ర్యాంకింగ్ ఇప్పించుకొన్నారని కొందరు విమర్శలు చేసారు.

 

ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజన్సీ (ఇక్రా) తెలంగాణా రాష్ట్రానికి ‘ఏ కేటగిరీ ఆర్ధిక శక్తి’ గా గుర్తించినట్లు తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కనుక ఇప్పుడు తెలంగాణాకు ఇక్రా ఇచ్చిన ఈ రేటింగ్ పైన కూడా  ఆంద్రప్రదేశ్ నేతలు, తెలంగాణాలో ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేయవచ్చును. ఇక్రా ఇచ్చిన ఈ రేటింగ్ గురించి తెలంగాణా ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే ప్రయత్నం చేయడం ఎంత సహజమో ప్రతిపక్షాలు దానిని విమర్శించడం అంతే సహజం.  ఇది ఇక్రా ఇచ్చిన నివేదికలా కాకుండా తెరాస తన ప్రభుత్వం గురించి తయారు చేసుకొన్నా స్వంత నివేదికలా ఉందని ప్రతిపక్షాలు అఆరోపించవచ్చును.

 

రాష్ట్రాల ఆర్ధిక స్థితిగతులను, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థల సామర్ధ్యాన్ని అధ్యయనం చేసి ప్రతీ ఏటా ఇక్రా నివేదిక ప్రకటిస్తుంటుంది. దాని ఆధారంగా దేశ విదేశాలకు చెందిన ఆర్ధిక సంస్థలు ఆయా రాష్ట్రాలకి ఏ మేరకు రుణాలు మంజూరు చేయవచ్చనే సంగతి నిర్దారించుకొంటాయి. ఇక్రా ప్రకటించిన తాజా నివేదికలో తెలంగాణా రాష్ట్రానికి ఏ-కేటగిరీ ఆర్ధికశక్తిగా ప్రకటించింది. దేశ తలసరి ఆదాయం రూ.74,380 కాగా తెలంగాణా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.95361 అని పేర్కొంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే పెట్టుబడి వ్యయంలో తెలంగాణా రాష్ట్ర రుణవాటా తక్కువగా ఉందని తెలియజేసింది.

 

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టి.యస్.ఐ.పాస్. వలన రాష్ట్రానికి గణనీయంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం సరయిన దిశలోనే నిధులను వినియోగిస్తున్నందున రాష్ట్రంలో ఆస్తుల సృష్టికి అవి దోహదపడతాయని పేర్కొంది. నీటి పారుదల పనులకు భారీగా నిధులు వెచ్చిస్తున్నందున రానున్న రోజుల్లో రాష్ట్రంలో వ్యవసాయంలో గణనీయమయిన అభివృద్ధి జరుగుతుందని పేర్కొంది. ఇక్రా ఇచ్చిన ఈ ఏ-1 రేటింగ్ వలన తెలంగాణా ప్రభుత్వ రుణ పరపతి పెరుగుతుంది. ఇటువంటి సానుకూల నివేదిక వలన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. 

 

దేశంలో గుజరాత్ తరువాత తెలంగాణా ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ తెలంగాణాలో ఆర్ధిక సమస్యల కారణంగా నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన తెరాస అధికారంలోకి వచ్చి 14నెలలు అవుతున్నా ఇంతవరకు రైతుల రుణాలు మాఫీ చేయలేకపోవడం చేతనే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకొంటున్నప్పుడు రైతుల రుణాలను ఒకే సారి ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు తెరాస ప్రభుత్వం జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉంది. రుణాలన్నీ ఒకేసారి చెల్లించేందుకు తమ వద్ద డబ్బులు నింపిన సూట్ కేసుల ఏవీ లేవని చెపుతోంది. ఇప్పుడు ఇక్రా సంస్థ కూడా తెలంగాణా తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువ అని ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఇక్రా ఇచ్చిన నివేదిక గురించి తెలంగాణా ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడానికి కష్టం అవుతుంది. చెప్పుకొనే ప్రయత్నం చేస్తే అది రైతుల పుండు మీద కారం చెల్లినట్లవుతుంది.  ఏది ఏమయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పధంలోనే ముందుకు సాగుతున్నట్లు ప్రపంచ బ్యాంక్, ఇక్రా గుర్తించడం చాల శుభపరిణామం.