పాక్ వైఖరితో నష్టపోతున్నది ఎవరు?

 

ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్, పాక్ దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోందిపుడు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్తాన్ మానుకొంటే ఇరుదేశాల మధ్య చర్చలకు ఆస్కారం కలుగుతుందని భారత్ వాదిస్తుంటే, ఉగ్రవాదం పేరుతో భారత్ శాంతి చర్చలు జరగకుండా కుట్రలు పన్నుతోందని పాకిస్తాన్ వాదిస్తోంది. ఇరుదేశాల మధ్య ఎప్పుడు చర్చలు జరగాలన్నా కాశ్మీర్ అంశమే కీలకంగా ఉంటుందని పాక్ వాదిస్తోంది.

 

ఇంతవరకు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ కాశ్మీర్ అంశం లేవనెత్తినప్పుడల్లా, అది భారత్ లో అంతర్భాగమని దానిపై చర్చలలో మూడో పక్షం తలదూర్చదానికి తాము అంగీకరించబోమని భారత్ వాదిస్తుండేది. కానీ ఇప్పుడు కేంద్రంలో మోడీ అధికారం చేపట్టాక భారత్ వాదనలో మరింత పదును పెరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి పాక్ వైదొలగాలని గట్టిగా డిమాండ్ చేయడమే కాకుండా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తోందని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పడం మొదలుపెట్టింది. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశం గురించి గట్టిగా మాట్లాడుతూ భారత్ కి ఇంతవరకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్న పాకిస్తాన్, భారత్ వైఖరిలో వచ్చిన అనూహ్యమయిన ఈ మార్పుతో ఐక్యరాజ్యసమితిలో తడబడుతూ ప్రపంచ దేశాల ముందు తలదించుకొనే పరిస్థితి ఏర్పడింది.

 

పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సంగతి అమెరికాతో సహా అన్ని దేశాలకి తెలుసు. కానీ ఐక్యరాజ్యసమితిలో దాని గురించి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి ప్రశ్నించకపోవడంతో పాక్ పెట్రేగిపోతోంది. కానీ ఇప్పుడు భారత్ సూటిగా ప్రశ్నించడంతో నేరుగా జవాబు చెప్పలేక ఈ గండం గట్టేక్కేందుకు తమ దేశంలో భారత్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని దానికి సంబంధించి కొన్ని ఆధారాలను ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రెటరీ బాన్-కి-మూన్ కి ఇచ్చామని ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది.

 

ఇరుగు పొరుగు దేశాలలో అశాంతి, అరాచకం, ఉగ్రవాదం నెలకొని ఉంటే అది అందరికీ చేటు కలిగిస్తుందనే సంగతి పాకిస్తాన్ కి అర్ధం కాకపోయుండవచ్చునేమో కానీ భారత్ కి తెలియదనుకోలేము. అందుకే నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, చివరికి ఆఫ్ఘనిస్తాన్ వంటి చాలా దేశాలలో శాంతి స్థాపనకు, అభివృద్ధికి భారత్ యధాశక్తిన తన సహాయ సహకారాలు అందిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం గత నాలుగు దశాబ్దాలుగా తన ఉగ్రవాదాన్ని భారత్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి ఇరుగు పొరుగు దేశాలకు ఎగుమతి చేస్తోంది. శ్రీనగర్ లో వేర్పాటువాదులు భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, పాకిస్తాన్, ఐ.యస్.ఐ.యస్. జెండాలను బహిరంగంగా ప్రదర్శిస్తుండటమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చును.

 

అందుకే ముందు ఆ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోమని భారత్ పాకిస్తాన్ కి సూచిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు వాదిస్తోంది. పాకిస్తాన్ భారత్ తో ఎటువంటి వైఖరి అవలంభించినప్పటికీ, అపుడప్పుడు ఉగ్రవాదుల దాడులను ఎదుర్కోవలసి రావడం తప్ప భారత్ కి వచ్చే నష్టం ఏమీ ఉండబోదు. కానీ భారత్, పాక్ సంబంధాలను పక్కనబెట్టి ఒకసారి ఆలోచిస్తే పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరి వలన భారత్ కంటే పాకిస్తాన్, దాని ప్రజలే చాలా ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పక తప్పదు. రెండు దేశాల ఆర్ధిక, రాజకీయ, పారిశ్రామిక అభివృద్ధిని పోల్చి చూసినట్లయితే ఆ విషయం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. ఈ వాదనను పాకిస్తాన్ అంగీకరించినా అంగీకరించకపోయినా ఆ దేశంలో నానాటికీ క్షీణిస్తున్న పరిస్థితులే అది తప్పుడు వైఖరి అవలంభిస్తోందని రుజువు చేస్తున్నాయి.

 

అటువంటప్పుడు పాకిస్తాన్ తన సమస్యల నుండి బయటపడి భారత్ తో పోటీ పడేవిధంగా ఎదిగేందుకు ఏమి చేయాలో ఆలోచించకుండా, తమ సమస్యలని కప్పి పుచ్చుకొంటూ, వాటి నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి ఇటువంటి వైఖరి అవలంభిస్తోంది. దాని వలన అంతిమంగా నష్టపోయేది ఆ దేశమే కానీ భారత్ కాదు. ఈ చేదు నిజాన్ని గత నాలుగు దశాబ్దాలుగా పాకిస్తాన్ గుర్తించలేకపోయింది. ఎప్పటికయినా గుర్తిస్తుందో లేదో కూడా తెలియదు. కానీ దూరదృష్టి లేని అటువంటి పాలకులు కలిగి ఉండటం పాక్ ప్రజల దురదృష్టమే.