ప్రజాస్వామ్యంలో నిరంకుశ విధానాలు అమలు సాధ్యమేనా?
posted on Oct 6, 2015 10:40AM
తెలంగాణా అసెంబ్లీ నుండి ప్రతిపక్ష సభ్యులు అందరినీ ప్రస్తుత సమావేశాలు పూర్తయ్యేంత వరకు తెరాస ప్రభుత్వం బహిష్కరించి అందరి నుండి విమర్శలు ఎదుర్కొంటోంది. రైతుల ఆత్మహత్యలతో సహా రాష్ట్రంలో అన్ని సమస్యలపై సావధానంగా చర్చించేందుకు ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కోరితే అన్ని రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని గొప్పగా చెప్పుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్, సమావేశాలు మొదలయినాలుగు రోజులు గడవక ముందే మొత్తం ప్రతిపక్ష సభ్యులు అందరినీ సభ నుండి సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు. మధ్యలో శనివారం నాడు ఏ కారణం లేకుండానే సభను సోమవారానికి వాయిదా వేసి పదిరోజుల సమావేశాలలో మరొకరోజు కట్టిరించేసారు.
రైతుల సమస్యలపై మాట్లాడేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని కేసీఆర్ చెప్పుకొన్నారు. కానీ చర్చ మొదలయిన మూడవ రోజునే దానిని ముగించారు. ప్రతిపక్షాలు దానిపై చర్చకు పట్టుబట్టడంతో అందరినీ బయటకు పంపించేసారు. రాష్ట్రంలో 32 అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు లేకుండానే సమావేశాలు నడిపించేస్తున్నారు. ఇక సభలో తమను ప్రశ్నించేవారే లేరు కనుక స్వోత్కర్ష, పరనిందలతో కులాసాగా మిగిలిన రోజులు గడిపేయవచ్చును.
కానీ కేసీఆర్ యొక్క ఈ నిరంకుశ పోకడలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారనే సంగతి మరిచిపోయినట్లున్నారు. అధికారం చేపట్టినప్పటి నుండి నేటి వరకు ఆయన నిరంకుశంగానే వ్యవహరిస్తున్నారు. మొదట మీడియాపై తన ప్రతాపం చూపిన కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షాలపై తన ప్రతాపం చూపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈవిధంగా నిరంకుశ విధానాలు అమలుచేయడం ఎంత గొప్పవారికయినా సాధ్యం కాలేదనే సంగతి చరిత్ర తిరగేస్తే అర్ధమవుతుంది.
రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలను నివారించడంలో విఫలమయిన తెరాస ప్రభుత్వం, కనీసం ఆ సమస్య పరిష్కారానికి ప్రతిపక్షాలు ఇస్తున్న సలహాలు, సూచనలను వినేందుకు కూడా ఇష్టపడకుండా అందరినీ సభ నుండి బయటకు సాగనంపింది. ఆ విధంగాచేసి మరింత అప్రదిష్ట మూటగట్టుకొంది. రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలదే బాధ్యత అని మళ్ళీ మళ్ళీ అదే పాట పాడుతుండటంతో రైతులు కూడా తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలకు పదవులు ఎరవేసి ఆకర్షిండం ద్వారా ఏ ప్రతిపక్ష పార్టీలను కేసీఆర్ బలహీనపరచాలనుకొన్నారో ఇప్పుడు వారి మధ్య చక్కటి ఐఖ్యత ఏర్పడింది. అందరూ కలిసి ఈనెల 10వ తేదీన బంద్ కి పిలుపు నివ్వడమే అందుకు ఉదాహరణ. అంతేకాదు ప్రతిపక్ష నేతలు అందరూ ఇప్పుడు నేరుగా రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలపై తెరాస ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో వివరించి చెప్పబోతున్నారు. ఆయనను నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టినప్పుడు వారి నమ్మకాన్ని నిలబెట్టుకొనే ప్రయత్నాలు చేయాలి. కానీ ఇటువంటి నిరంకుశ పోకడలతో అందరి గొంతులు అణచివేయాలని ప్రయత్నిస్తే అంతిమంగా తెరాసయే దానికి మూల్యం చెల్లించవలసి వస్తుంది.