'ముద్దు మొద్దునిద్ర పోతున్నారా?'
posted on Apr 20, 2012 10:41AM
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గాలి ముద్దుకృష్ణమనాయుడు తన ప్రత్యర్థులపై చేసే విమర్శలు వాడిగానూ, వేడిగానూ ఉంటాయి. ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా సరే పట్టించుకోకుండా వారిపై విమర్శల జడివాన కురిపిస్తారు. గాలి ముద్దు కృష్ణమ నాయుడు నోటికి భయపడి ఆయనతో వాగ్యుద్ధానికి ఎవరూ ముందుకు రారు. కానీ, అటువంటి ముద్దు కృష్ణమనాయుడు ఇటీవల మౌనవ్రతం దాల్చుతున్నారు. అవసర మైతే తప్ప నోరు విప్పటం లేదు. అనవసరంగా ఎవరిపైనా నోరు పారేసుకోవటం లేదు. ముద్దు కృష్ణమనాయుడు వైఖరి ప్రస్తుతం తెలుగుదేశంపార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
అందరినీ విమర్శించి అకారణంగా తానెందుకు ఇతరుల కోపానికి బలికావాలన్న అంతర్మధనంలో ముద్దు కృష్ణమనాయుడు పడిపోయినట్లు తెలుస్తోంది. తాను ఎవరిని విమర్శించినా పార్టీ అధికార ప్రతినిధిగానే విమర్శిస్తున్నానని, కానీ ప్రత్యర్థులు తనపై వ్యక్తిగతంగా కక్షగడుతున్నారని ముద్దు కృష్ణమనాయుడు వాపోతున్నట్లు తెలిసింది. పార్టీలో అనేకమంది సీనియర్లు ఉండగా తానొక్కడే ఎందుకు విమర్శలు చేయాలన్న భావన కూడా ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇదంతా తెలియని పత్రికాప్రతినిధులు మాత్రం గాలి ముద్దు కృష్ణమనాయుడు తమకు వార్తలు ఇవ్వకుండా మొద్దునిద్ర పోతున్నారని అనుకుంటున్నారు.