కమ్యూనిస్టుల వింతధోరణి!
posted on Apr 20, 2012 10:45AM
నిత్యం నిద్రలేచిన దగ్గరనుంచి సిద్ధాంతాల గురించి వల్లెవేసే కమ్యూనిస్టులు ఎన్నికల పొత్తు విషయంలో వారు అవలంభించే విధానాలు, వేసే ఎత్తుగడలు చూసినప్పుడు చాలా వింతగా అనిపిస్తుంది. వారి దృష్టిలో కాంగ్రెస్, తెలుగుదేశంలు బూర్జువాపార్టీలు. అయినా ఎన్నికల్లో వాటితో పొత్తుపెట్టు కొంటారు. ఎన్నికల్లో నాలుగు సీట్లు ఎక్కువ వస్తే ఎంతోగోప్పగా ఎత్తుగడలు వేసినట్టు, ఓడిపోయి సీట్లు తగ్గిపోతే వ్యూహం విఫలమైనట్టు వారు విశ్లేషణలు చేస్తారు.
ఒక ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటారు. మరొక ఎన్నికలకు తెలుగుదేశంపార్టీతో పొత్తుపెట్టుకుంటారు. మరో ఎన్నికల్లో ఎవరితోనూ పోట్టులేకుండా ఉభయ కమ్యూనిస్టులు కలిగి పోటీ చేస్తారు. ఎన్నికలకి ఎన్నికలకి మధ్య ఏమార్పులు జరిగాయో ... ఒప్పందాలు ఎందుకు మార్చుకుంటారో సామా న్యులకు అంతుపట్టవు. ఉభయ కమ్యూనిస్టు నేతలు సభలు, మహాసభల సందర్భంగా వేదికలపై చేతులు కలిపి ఫోటోలు దిగుతారు. కలిసి ఉద్యమాలు చేస్తామని ప్రకటిస్తారు. తర్వాత ఎవరి దుకాణం వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
త్వరలోల జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో రెండు కమ్యూనిస్టు పార్టీల మధ్య ఎటువంటి చర్చలు జరగలేదు. ఉప ఎన్నికల్లో సిపిఎం విడిగా ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అన్ని స్థానాలకు పోటీ చేస్తుందా? లేక తెలంగాణలోని పరకాల, ప్రకాశం జిల్లాలోని స్థానాలకే పరిమితం అవుతుందా? పోటీ చేయని మిగిలిన స్తానాలో ఏ పార్టీకి మద్దతు తెలియచేస్తుంది? అనే అంశాలు నిర్థారణ కాలేదు. సిపీఐ మాత్రం తెలుగుదేశంపార్తీతో పొత్తుపెట్టుకోవాలనే ఆలోచనలో కాదు ... కాదు ... ఎత్తుగడలో వుంది. ఉప ఎన్నికలు జరిగే 18 స్తానాలో అనంతపురం సిపీఐకి కేటాయించే పక్షంలో మిగిలిన అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశంపార్టీకి మద్దతు ప్రకటించే విధంగా ఆ పార్టీ నేత నారాయణ తెలుగుదేశంపార్టీ నాయకుడు చంద్రబాబుతో సంప్రతింపులు జరుపుతున్నారు. కమ్యూనిస్టులతో విసిగిపోయిన కొంతమంది తెలుగుదేశం నేతలు కమ్యూనిస్టులతో పొత్తులు అనవసరం అంటుంటే చంద్రబాబు మాత్రం కీలకంగా భావిస్తున్న ఉప ఎన్నికలలో విజయం సాధించడానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు.