వైసీపీకి బాలినేని గుడ్‌బై.. రేపే జనసేనలోకి...!

వైఎస్ జగన్, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న ముసుగులో గుద్దులాట ముగిసింది. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. త్వరలో ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు. గురువారం నాడు ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో భేటీ కానున్నారు.  కొద్ది రోజుల నుంచి బాలినేని వైసీపీని వీడనున్నారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అవి నిజమయ్యాయి. జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేంతవరకు జగన్‌తో టామ్ అండ్ జెర్రీ గేమ్ ఆడిన బాలినేని... పవన్ కళ్యాణ్ నుంచి ఓకే సిగ్నల్ రాగానే వైసీపీకి గుడ్ బై కొట్టేశారు.

వైసీపీలో బాలినేని గత మూడేళ్లుగా హాఫ్ రెబల్‌గానే కొనసాగుతున్నారు. ఇటు బాలినేనికీ, అటు వైసీపీ అధినేతకూ కూడా పరస్పర అవసరాలు ఉన్నాయి. పైపెచ్చు ఇరువురూ బంధువులు కూడా. అయినా బాలినేనికి పొమ్మనకుండా పార్టీలో పొగపెట్టడం అన్నది గత కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగుతూ వస్తోంది. ఇది ఎప్పుడు మొదలైందంటే.. జగన్ తాను అధికారం చేపట్టిన తరువాత దాదాపు మూడేళ్లకు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆ పునర్వ్యవస్థీకరణలో బాలినేని మంత్రి పదవినుంచి తొలగించారు. అదే సమయంలో ఆయన జిల్లాకే చెందిన మంత్రిని మాత్రం కొనసాగించారు. ఇది బాలినేనిలో అసంతృప్తికి బీజం వేసింది.

అప్పటి నుంచీ  ఆయన పార్టీకి, పార్టీ అధినేత జగన్‌కు పంటికింద రాయిలా, చెవిలో జోరీగలా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. అయితే జగన్ పొమ్మన్న ప్రతిసారీ బాలినేని చూరుపట్టుకు వేలాడారు. అలాగే బాలినేని పార్టీకి గుడ్ బై చెబుతానంటూ అల్టిమేటం ఇచ్చిన ప్రతిసారీ జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించుకుని బుజ్జగించారు. ఎందుకంటే బాలినేనికి ప్రకాశం జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఇలా బాలినేని జగన్ మధ్య ఇన్నేళ్లూ టామ్ అండ్ జెర్రీ ఆట సాగుతూనే వచ్చింది.

అయితే 2024 ఎన్నికలలో వైసీపీతోపాటు బాలినేని కూడా పరాజయం పాలవ్వడంతో ఇక ఒకరి అవసరం ఒకరికి లేకుండా పోయింది. మరో ఐదేళ్ల వరకూ ఎన్నికలు లేకపోవడం, ఇప్పుడు జనసేన నుంచి రాజకీయ ఆశ్రయం దొరకడంతో ఆయన ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే సమయం చూసుకుని జగన్‌కు షాక్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే పార్టీలోనే ఉంటూ రోజుకో విమర్శ, పూటకో డిమాండ్‌తో  ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బాలినేని పార్టీ నుంచి ఎగ్జిట్ అవ్వడంతో జగన్ కూడా హమ్మయ్య అనుకునే పరిస్థితి ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.