సుప్రీంకు చంద్రబాబు ఆస్తుల కేసు
posted on Nov 21, 2011 11:18AM
న్యూఢిల్లీ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను సవాల్ చేస్తూ టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆస్తులతో పాటు వారి ఆస్తులపై కూడా విచారణకు హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్ మేరకు హైకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయబోనని చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరి, పార్టీ నాయకుడు సిఎం రమేష్ వ్యక్తిగతంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీరంతా వేర్వేరుగా న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ విచారణను నిలిపివేయాలని తమ పిటిషన్లలో పేర్కొన్నారు.