విశాఖపట్నంలో టీసీఎస్..!

విశాఖలో సాఫ్ట్.వేర్ సంస్థల్లో దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఏర్పాటు కానుంది. టీసీఎస్ విశాఖపట్టణంలో 10,000 మందికి ఉపాధి కల్పించే  బ్రాంచ్‌ని ఏర్పాటు చేయబోతోంది. ఈ శుభవార్తని ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ తెలియజేశారు. మంగళవారం నాడు లోకేష్ ముంబైలో టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో చర్చలు జరిపిన తర్వాత బుధవారం నాడు ఒక భారీ ప్రకటన వెలువడబోతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ భారీ ప్రకటనను నారా లోకేష్ బుధవారం సాయంత్రం చేశారు. కూటమి ప్రభుత్వం స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లక్ష్యంగా పెట్టుకుందని, కార్పొరేట్ కంపెనీల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సానుకూల వాతావరణం కల్పిస్తోందని లోకేష్ తెలిపారు. టీసీఎస్ కార్యాలయం విశాఖలో ఏర్పాటు కావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దడంలో పడిన పెద్ద అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం పునరుజ్జీవం విషయంలో ఇది కీలకమైన ముందడుగు అని  ఐటీ వర్గాలు అంటున్నాయి.