వ్యాపార దిగ్గజం, దానకర్ణుడు రతన్ టాటా!

బుధవారం రాత్రి కన్నుమూసిన పారిశ్రామిక, వ్యాపార దిగ్గజం రతన్ టాటా... టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని శాఖోపశాఖలుగా విస్తరించడం మాత్రమే కాదు.. దానధర్మాలు చేయడంలో అపర కర్ణుడిగా పేరు సంపాదించారు. పది వేల కోట్ల రూపాయల స్థాయి నుంచి టాటా గ్రూపును లక్ష కోట్ల స్థాయికి చేర్చారు. రతన్ టాటా 1961లో టాటా గ్రూప్‌లో చేరారు. జె.ఆర్.డి. టాటా నుంచి ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఆయన సంస్థని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారు. ఎన్నో సంస్థలను కొనుగోలు చేసి టాటా సంస్థను మరింత పటిష్టం చేశారు. ఉత్సాహవంతులైన యువకులు అంకుర సంస్థలను స్థాపించడానికి తన ప్రోత్సాహాన్ని అందించారు. తాను సంపాదించిన దానిలో 60 నుంచి 65 శాతం వరకు ఆయన దానధర్మాలకే కేటాయించారు. భారతీయ పారిశ్రామిక రంగానికి కొత్త దిశ, దశను చూపించిన రతన్ టాటా భారత దేశ వాణిజ్య, పారిశ్రామిక రంగాల పురోభివృద్ధిలో కీలక పాత్రను పోషించారు. టాటా గ్రూప్‌ని లక్ష కోట్ల సామ్రాజ్యంగా మార్చిన తర్వాత ఆయన సంస్థ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుని సమాజ సేవ బాధ్యతలను స్వీకరించారు. కరోనా సమయంలో దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోతున్న సమయంలో 15 వందల కోట్లను రతన్ టాటా విరాళంగా అందించారు. ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేసి, ఎందరి జీవితాలలోనో వెలుగులు నింపిన రతన్ టాటా తన జీవితాన్ని సమాజానికే అంకితం చేశారు. ఆయన అవివాహితుడు. జీవితం మొత్తాన్ని జాతికే అంకితం చేసిన ధన్యజీవి రతన్ టాటాకి ‘తెలుగువన్’ నివాళులు అర్పిస్తోంది.